Municipal Elections: పుర పోరుకు పార్టీలన్నీ సై
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:14 AM
మునిసిపల్ ఎన్నికలకు త్వరలో తెరలేవనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు తమదైన వ్యుహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభం
పట్టణాల్లో పాగాకు బీజేపీ వ్యూహం
ప్రభుత్వ వ్యతిరేకతపైనే బీఆర్‌ఎస్ ఆశలు
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలకు త్వరలో తెరలేవనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు తమదైన వ్యుహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి పైచేయి సాధించాలని అధికార, విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే పల్లెలపై పట్టు సాధించిన అధికార కాంగ్రెస్.. పట్టణాల్లోనూ గెలిచి తన సత్తా చాటాలనుకుంటోంది. ఇటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసివస్తుందన్న భావనలో విపక్ష బీఆర్‌ఎస్ ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటర్లే తమకు ప్రధాన బలమని, కచ్చితంగా పురపోరులో తమ సత్తా చూపిస్తామని కమలనాథులు అంటున్నారు. మొత్తంగా పట్టణ ప్రాంత ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్రధాన పార్టీలన్నీ కుస్తీలు పడుతున్నాయి. అయితే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ బహుముఖ వ్యుహంతో బరిలోకి దిగింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి శరవేగంగా జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 60 శాతానికి పైగా స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో.. అదే ఊపుతో పట్టణాల్లోనూ పాగా వేయాలని భావిస్తున్నారు. పల్లెపోరు సమయంలో సమీపంలోని పట్టణ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి, పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి పల్లె ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి, పరోక్షంగా మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకోవడం ద్వారా తమ ప్రభుత్వంపై రాష్ట్రంలో అన్నిచోట్లా సానుకూలత ఉం దన్న అభిప్రాయాన్ని కల్పించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఫిబ్రవరి మొదటివారం నుంచి సీఎం ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. గెలుపు బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భుజాలపై పెట్టి, ముందుండి నడిపించనున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న అఽధికార పార్టీ.. విపక్షాల కంటే చాలా ముందుంది.
ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్‌ఎస్ ఆశలు..
అధికార కాంగ్రె్‌సపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, అందుకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శమని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. పంచాయతీల్లో తాము 27 శాతం గెలుచుకున్నామని, అదే ఊపుతో పురపోరులో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్నారు. మునిసిపాలిటీలకు గత రెండేళ్లుగా ఎటువంటి నిధులు రావడం లేదని, అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చాం, అభివృద్ది ఎలా జరిగింది? అన్న అంశాలను ప్రజలకు వివరిస్తూ వారిని తమవైపు తిప్పుకోవాలని గులాబీ పార్టీ వ్యూ హాలు రచిస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక అంశాలను లేవనెత్తుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ఉంది. ఎలాగైనా మెజారిటీ స్థానాలను దక్కించుకుని హస్తం పార్టీకి షాకివ్వాలని పట్టుదలతో ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో గెలవడం ద్వారా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడాలని భావిస్తోంది.
వ్యూహాత్మక కార్యాచరణతో బీజేపీ..
మునిసిపల్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మక కార్యాచరణతో సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో తమకు ఆదరణ బాగా ఉందని భావిస్తున్న కమలనాథులు.. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే దిశగా అంతర్గత కసరత్తు చేపట్టారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని తొలిమెట్టుగా గుర్తించిన పార్టీ నాయకత్వం.. పురపోరును వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెండో మెట్టుగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఇన్‌చార్జులను నియమించింది. కాంగ్రెస్ సర్కారు అవినీతికి, కమీషన్లకు, నేర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కమలనాథులు ఈ అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బీజేపీ గెలిస్తేనే మునిసిపాలిటీల అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం అందిస్తున్న నిధులతోనేనని, ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు మంజూరవుతాయని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు చెప్పనున్నారు.