Share News

అశ్వారావుపేటలో పొలిటికల్‌ ‘కుక్కర్‌’ హీట్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:00 AM

మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన 24 గంటల తర్వాత భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మునిసిపాలిటీలోని పదో వార్డు ఓటర్లు గురువారం వినూత్న....

అశ్వారావుపేటలో పొలిటికల్‌ ‘కుక్కర్‌’ హీట్‌

ఖమ్మం/ అశ్వారావుపేట/ కల్లూరు/మిర్యాలగూడ అర్బన్‌, పిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన 24 గంటల తర్వాత భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మునిసిపాలిటీలోని పదో వార్డు ఓటర్లు గురువారం వినూత్న ఆందోళనకు దిగారు. పదోవార్డు కాంగ్రెస్‌ పార్టీ హరిబాబు తన గెలుపుకోసం ఓటర్లకు రూ.2,500 నగదుతోపాటు ‘ప్రెషర్‌ కుక్కర్‌’ పంపిణీ చేశారని వార్తలొచ్చాయి. కానీ తనకు ఓటేయలేదని దుర్భాషలాడారని ఓటర్లు ఆందోళనకు దిగారు. హరిబాబు ఇచ్చిన ‘ప్రెషర్‌ కుక్కర్‌’లు రోడ్డుపై పెట్టి ‘ఇవిగో మీరిచ్చినవి మీరే తీసుకోండి’ అని నిరసన తెలిపిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో పొలిటికల్‌ హీట్‌ పెరగడంతో స్పందించిన అభ్యర్థి హరిబాబు స్పందిస్తూ.. ‘అసలు తానెవరినీ దుర్బాషలాడలేదని, ఎవరో కుట్రపూరితంగా తనను ఇరికించడానికి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, ఇది అవాస్తవమని సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేశారు.

కల్లూరులో బీఆర్‌ఎస్‌ ‘ముందస్తు క్యాంపు’

ఖమ్మం జిల్లా కల్లూరు మునిసిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ముందస్తుగానే గురువారం క్యాంపునకు తరలించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ గట్టి పోటీనివ్వడంతో బలాబలాలు తారుమారైతే తమ వారిని మభ్యపెట్టి హస్తం పార్టీ నేతలు తీసుకెళ్తారన్న భయంతోనే ముందస్తు క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మునిసిపాలిటీలోని 20 వార్డుల అభ్యర్థులను కల్లూరు మండలం పోచారం గ్రామ బీఆర్‌ఎస్‌ నేత కట్టా అజయ్‌ కుమార్‌ ఇంటికి తరలించారు. విజేతలను కాపాడుకోవాలని ఆయా పట్టణాల నేతలకు బీఆర్‌ఎస్‌ ఆదేశాలు పంపినట్లు వినికిడి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్‌ తర్వాత అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా విజేతలను క్యాంపుకు తరలించడానికి కసరత్తు చేస్తోంది.

మిర్యాలగూడలో కౌన్సిలర్‌ అభ్యర్థి సహా ఐదుగురి అరెస్టు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డ(29వ) వార్డులో బీఆర్‌ఎస్‌- సీపీఎం కూటమి ఏజంట్లపై దాడి ఘటనలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ జావేద్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌- సీపీఎం కూటమి ఏజంట్లుగా పని చేసిన షేక్‌ మస్తాన్‌, షేక్‌ జమీర్‌, షేక్‌ బడేమియాలపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన జావేద్‌తోపాటు ఆయన అనుచరులు కరీముల్లా, హమీద్‌, పాషా, సిద్దిక్‌లను అరెస్ట్‌ చేశామని మిర్యాలగూడ టూటౌన్‌ సీఐ తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 05:00 AM