Share News

Illegal Lending: యాదగిరి.. దాదాగిరి

ABN , Publish Date - Jan 07 , 2026 | 04:22 AM

వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు. అంతటితో ఆగక ఆ కుటుంబ సభ్యులపై దూషణలు....

Illegal Lending: యాదగిరి.. దాదాగిరి

  • హనుమకొండలో పోలీసు వడ్డీల దందా స్థానికంగా రూ.4-5 వడ్డీకి అప్పులు.. ముక్కుపిండి వసూళ్లు

  • అప్పు తీర్చని ఓ కుటుంబంపై దౌర్జన్యం.. ఇంటికి తాళం, దాడి

హనుమకొండ టౌన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు. అంతటితో ఆగక ఆ కుటుంబ సభ్యులపై దూషణలు, దాడికి దిగాడు. హనుమకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబేదారి సీఐ రంజిత్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్‌ నగర్‌కు చెందిన గోక అరుణ ఇరిగేషన్‌ శాఖలో సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ ఉన్నారు. అదే కాలనీలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ యాదగిరి 30 ఏళ్లుగా ఉంటున్నారు. ఆయన పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అరుణ.. కుమార్తె వివాహం కోసం యాదగిరి వద్ద 2023లో రూ.3లక్షల 20 వేలు అప్పుగా తీసుకున్నారు. నెల నెలా రూ.4 చొప్పున రూ.14,400 వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. అయితే ఏడు నెలలుగా వడ్డీ కట్టడం లేదు. దీంతో యాదగిరి వచ్చి అరుణను వడ్డీ డబ్బులు అడిగారు. తమ కుటుంబ పరిస్థితి బాగాలేదని, కొంత సమయం కావాలని ఆమె వేడుకుంది. కానీ ఆయన వినలేదు. సోమవారం యాదగిరి కుటుంబసభ్యులతో అరుణ ఇంటికి వచ్చి ఆమె కుమారుడు శ్రావణ్‌తో గొడవకు దిగారు. వారి గేటుకు తాళం వేసి వెళ్లారు. దీంతో శ్రావణ్‌ జరిగిన విషయం తల్లికి చెప్పి, గోడ దూకి వచ్చి తాళం పగలగొట్టారు. కొద్దిసేపటికే ఈ విషయం తెలుసుకున్న యాదగిరి.. తన కుమారులు సాయి, బన్నీ, కూతురు అనూష, భార్య పద్మతో పాటు మరికొందరితో కలిసి మళ్లీ అక్కడికి వచ్చి.. అరుణ, శ్రావణ్‌పై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాదగిరితోపాటు ఐదుగురిపై కేసు నమోదైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, వడ్డీ వ్యాపారంలో యాదగిరి రూటే వేరని స్థానికులు చెబుతున్నారు. ఈయన ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇస్తుంటారని, నెలకు రూ.5 వరకు వడ్డీ వసూలు చేస్తారని అంటున్నారు. ఇతర వ్యక్తుల వద్ద రూ.2 వడ్డీకి డబ్బులు తెచ్చి, తిరిగి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తారని చెబుతున్నారు. ఇలా దాదాపు రూ.60లక్షల వరకు అధిక వడ్డీలకు తిప్పుతున్నారని అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 20 ఏళ్లుగా యాదగిరి వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Jan 07 , 2026 | 04:22 AM