‘పోలీసు అక్క’ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:56 AM
బడులు, కాలేజీల్లో బాలికలపై వేధింపులను అరికట్టడంతో పాటు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రారంభించిన ‘పోలీసు అక్క’ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది.
జాతీయస్థాయి అవార్డుపై డీజీపీ శివధర్‌రెడ్డి హర్షం
విద్యార్థినులపై వేధింపులను నివారణతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రాజెక్టే ‘పోలీసు అక్క’
హైదరాబాద్/దిలావర్‌పూర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బడులు, కాలేజీల్లో బాలికలపై వేధింపులను అరికట్టడంతో పాటు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రారంభించిన ‘పోలీసు అక్క’ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది. దీనిపై డీజీపీ శివధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ఈ ‘పోలీసు అక్క’ ప్రాజెక్టును ప్రారంభించారు. అవార్డుపై జానకీ షర్మిల మాట్లాడుతూ చిన్న ఆలోచనగా మొదలైన ‘పోలీసు అక్క’ ప్రయాణం జాతీయ స్ధాయి గౌరవాన్ని సొంతం చేసుకోవడం గర్వకారణమన్నారు. బడులు, కాలేజీల్లోని బాలికలతో మహిళా పోలీసులు సత్సంబంధాలు నెలకొల్పుతూ వారికి ఎదురయ్యే సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, విద్యార్థినుల్లో ధైర్యం నింపడం ‘పోలీసు అక్క’ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఇందులో భాగంగా జిల్లాలోని కేజీబీవి హస్టళ్లలో విద్యార్థినులతో మహిళా పోలీసులు రాత్రి బస చేస్తూ వారి సమస్యలను తెలుసుకొంటూ, వాటిని ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. ఈ కార్యక్రమం ద్వారా 7వేల మందికి పైగా బాలికలు ప్రయోజనం పొందారని శివధర్‌రెడ్డి అన్నారు.