పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై అధ్యయనం
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:34 AM
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పరిసర మండలాల్లో ముంపు ఏ మేరకు ఉంటుందన్న ...
4 మండలాల్లో పర్యటించిన అధికారులు
భద్రాచలం, జూన్ 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పరిసర మండలాల్లో ముంపు ఏ మేరకు ఉంటుందన్న అంశంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, నీటి పారుదలశాఖ అధికారుల బృందం అధ్యయనం చేసింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ(పీపీఏ) సీఈవో సంజీవ్‌వోరా, మెంబర్ సెక్రటరీ(ఎంఎస్) రఘురాం, సీఈ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ రమేష్, డైరెక్టర్ సతీష్, డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, రవి, నీటి పారుదల శాఖ భద్రాచలం ఈఈ ఎస్‌కే జానీ తదితర అధికారులతో కూడిన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో 4 మండలాల్లో పర్యటించింది. ముందుగా కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో పర్యటించి పరిశీలించింది. ఈ సమయంలో నీటి పారుదలశాఖ అధికారులు కిన్నెరసాని, ముర్రేడు వాగులు వరదల సమయంలో ఎగపోటుతో ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం భద్రాచలం వైపు ఉన్న 8 స్లూయి్‌సలను అధ్యయన బృందంలోని అధికారులు పరిశీలించారు. అలాగే, దుమ్ముగూడెం మండలం తూరుబాక బ్రిడ్జి వద్ద పరిస్థితి, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్‌కు ముంపు ముప్పు ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ అధ్యయనం బృందం పరిశీలన చేసింది.