బాధితురాలు మైనరే..
ABN , Publish Date - May 16 , 2026 | 05:09 AM
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. బాధితురాలు మైనర్‌కాదు మేజర్ అనే ఆరోపణలపై పరిశీలన జరుపుతున్నామని శుక్రవారం తెలిపారు.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం
బాధితురాలికి చెందిన రెండు బర్త్ సర్టిఫికెట్లపై పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణ
నిర్మల్‌లో జన్మించినట్టు ఒకటి.. హైదరాబాద్‌లో మరొకటి
రెండేళ్ల తేడాతో వేర్వేరు జిల్లాల్లో ధ్రువపత్రాలు
ఒకదాని ప్రకారం 17 ఏళ్ల 9 నెలలు.. ;మరొకటి 15 ఏళ్ల 9 నెలలు
రెండింటి ప్రకారమూ బాధితురాలు మైనర్‌గా నిర్ధారణ: డీసీపీ
విచారణకు వస్తానని గైర్హాజరైన బండి భగీరథ్
హైదరాబాద్ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. బాధితురాలు మైనర్‌కాదు మేజర్ అనే ఆరోపణలపై పరిశీలన జరుపుతున్నామని శుక్రవారం తెలిపారు. ‘‘ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం.. బాధితురాలు సమర్పించిన రెండు పుట్టినరోజు ధ్రువపత్రాలపై దర్యాప్తు చేశాం. ఒకదానిలో నిర్మల్‌లో, మరొకదానిలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్టుగా ఉంది. ఒక సర్టిఫికెట్ (పుట్టిన తేదీ 2010 ఆగస్టు 12) ప్రకారం బాధితురాలి వయసు 17 ఏళ్ల 9 నెలలు. మరో సర్టిఫికెట్ (పుట్టిన తేదీ 2008 ఆగస్టు 12) ప్రకారం 15ఏళ్ల 7 నెలలుగా ఉంది. రెండింటి ప్రకారం చూసినా బాధితురాలు ఇప్పటికీ మైనర్ అని తెలుస్తోంది’’ అని డీసీపీ వెల్లడించారు. అయితే ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు జిల్లాల నుంచి రెండు బర్త్ సర్టిఫికెట్స్ ఎలా తీసుకున్నారు.? ఎందుకు తీసుకున్నారనేది తేలాల్సి ఉందన్నారు.
విచారణకు హాజరుకాని భగీరథ్
బండి భగీరథ్ శుక్రవారం కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. భగీరథ్‌ను తీసుకొని మే 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరుకావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు కరీంనగర్‌లోని ఆయన మేనమామ ఇంట్లో నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఆరోజున విచారణకు రాని భగీరథ్.. 15న అన్ని ఆధారాలతో విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు. కానీ శుక్రవారం విచారణకు రాలేదు. మరోవైపు భగీరథ్ కోసం ఐదు బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నామని.. సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు టెలికం సంస్థలను, సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించామని వెల్లడించారు.