Share News

బండి భగీరథ్‌కు బెయిల్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:27 AM

పోక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్‌ మల్కాజిగిరి న్యాయస్థానం శనివారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

బండి భగీరథ్‌కు బెయిల్‌

  • ఇంజనీరింగ్‌ పరీక్షలు రాసేందుకు అనుమతి

  • 4 రోజుల బెయిల్‌

  • 25న తిరిగి చర్లపల్లి జైలుకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్‌ మల్కాజిగిరి న్యాయస్థానం శనివారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఇంజనీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు జూన్‌ 20 నుంచి 24వ తేదీ వరకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ భగీరథ్‌ తరఫున అతని న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్‌ తరఫున వాదనలు విన్న మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి తిరుపతి.. బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బెయిల్‌ షరతులను కచ్చితంగా పాటించాలని, జూన్‌ 25న చర్లపల్లి జైలుకు తిరిగి రావాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అందుకున్న చర్లపల్లి జైలు అధికారులు బండి భగీరథ్‌ను శనివారం రాత్రి విడుదల చేశారు. కాగా, మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో బాధిత బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మే 9వ తేదీన పోక్సో చట్టం కింద నమోదు చేసిన పేట్‌బషీరాబాద్‌ పోలీసులు బండి భగీరథ్‌ను మే 16న అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నెల రోజులకు పైగా చర్లపల్లి కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న భగీరథ్‌ శనివారం విడుదలయ్యారు.

Updated Date - Jun 21 , 2026 | 05:27 AM