పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ‘హెచ్‌ఐవీ ఇంజెక్షన్’!
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:58 AM
ఎంత దుర్మార్గం అతడిది! తనకు ఎయిడ్స్ ఉన్నదని తెలిసీ పెళ్లి కోసం ఆ యువతిపై ఒత్తిడి చేశాడా యువకుడు! అతడికి ఆ రోగం ఉందని తెలిసి ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు.
యువతి మేనబావ ఘాతుకం
మేడ్చల్ జిల్లా పోచారంలో ఘటన
ఘట్‌కేసర్ రూరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎంత దుర్మార్గం అతడిది! తనకు ఎయిడ్స్ ఉన్నదని తెలిసీ పెళ్లి కోసం ఆ యువతిపై ఒత్తిడి చేశాడా యువకుడు! అతడికి ఆ రోగం ఉందని తెలిసి ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు ఉన్మాదంతో ప్రవర్తించాడు. యువతి ఇంట్లోకి చొరబడి ఆమెకు బలవంతంగా ఎయిడ్స్ రక్తంతో కూడిన ఇంజెక్షన్ ఇచ్చాడు. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. పోచారం డివిజన్ అన్నోజిగూడ, రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన కె. మనోహర్(25) ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మేన మరదలు వరుసయ్యే యువతితో అతడికి గత ఏడాదిలో వివాహం నిశ్చయమైంది. తర్వాత మనోహర్‌కు ఎయిడ్స్ ఉందని యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో అతడికి తమ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకు యువతి కుటుంబసభ్యులు నిరాకరించారు. అయినా తననే పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ పలుమార్లు ఒత్తిడిచేశాడు. 11న యువతి ఇంట్లో ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి.. మరోసారి పెళ్లి విషయమై యువతితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర అవేశానికి గురైన మనోహర్ ముందుగానే వెంట తెచ్చుకున్న ఎయిడ్స్ సోకిన రక్తంతో ఉన్న ఇంజెక్షన్‌ను బలవంతంగా యువతికి ఎక్కించి పరారయ్యాడు. మర్నాడు యువతికి జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. చేతిపై ఇంజెక్షన్ గాట్లు ఉండటంతో వైద్యులు ఏం జరిగిందని యువతిని ప్రశ్నించగా తనకు జరిగిన విషయాన్ని యువతి వెల్లడించింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మనోహర్ తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉం డగా.. తండ్రి ఇప్పటికే మృతిచెందినట్లు తెలిసింది.