తెలంగాణ ఐటీఐలకు మహర్దశ
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:02 AM
తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. వృత్తి విద్యతోపాటు, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ..
757.19 కోట్లతో ఆధునికీకరణ
3 క్లస్టర్ల పరిధిలో ‘పీఎం సేతు’ అమలు
కార్పొరేట్ సంస్థల సహకారం
కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. వృత్తి విద్యతోపాటు, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ.. ‘పీఎం-సేతు’ (ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐ) పథకం కింద తెలంగాణలో మూడు ఐటీఐ క్లస్టర్ల ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో, రూ. 757.19 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర నైపుణ్యాభివృద్థి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ‘పీఎం-సేతు’ 4వ నేషనల్ స్టీరింగ్ కమిటీ (ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 200 క్లస్టర్ల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, గుజరాత్ రాష్ర్టాల్లో కలిపి ఐదు ఐటీఐ క్లస్టర్లను రూ.1,237.58 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తెలంగాణలో ఓల్డ్ సిటీ, పటాన్‌చెరు, సంగారెడ్డి క్లస్టర్లను ఆధునీకరించనున్నారు.