Share News

వచ్చే నెల్లో ప్రధాని మోదీ పర్యటన!

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:50 AM

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

వచ్చే నెల్లో ప్రధాని మోదీ పర్యటన!

  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రారంభోత్సవం?

  • పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రధాని పర్యటన కొనసాగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. సుమారు రూ.650 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్సులో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో లభించే వెసులుబాటును బట్టి ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్‌రావులు శనివారం హైదరాబాద్‌ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. నగరంలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు ప్రధాని పర్యటన ఏర్పాట్లపైనా చర్చించారు. చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే తప్ప మోదీ, వచ్చే నెల తొలివారంలోనే రాష్ట్ర పర్యటనకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 22 , 2026 | 05:51 AM