మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు త్వరలో శంకుస్థాపన
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:44 AM
రాష్ట్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ జిల్లాలోని మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం!
మామునూరుకు రూ.850 కోట్లు అవసరమని అంచనా
వరంగల్ వారసత్వం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 1,061 కోట్లు అవసరమని నివేదిక
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 10 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ జిల్లాలోని మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం. జూన్‌లో శంకుస్థాపన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. అధికార యంత్రాంగం ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మామునూరు ఎయిర్‌పోర్టు టెర్మినల్, రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సెంటర్ల నిర్మాణంతో పాటు నావిగేషన్ పరికరాలకు కలిపి దాదాపు రూ.850 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్లు-భవనాల శాఖ సమీక్ష సందర్భంగా అందించిన నివేదికలో పొందుపర్చారు. ఎయిర్‌పోర్టుకు అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం రూ.295 కోట్లు మంజూరు చేసింది. నీటిపారుదల విభాగానికి చెందిన కొన్ని నిర్మాణాల కోసం రూ.68.81 కోట్లు అవసరమని అంచనావేశారు. మా మునూరు నుంచి గుంటూరుపల్లి వరకు రోడ్ల అనుసంధానం కోసం రూ.32.40 కోట్లు అవసరమని తేల్చారు. ఈ విమానాశ్రయాన్ని వరంగల్ జిల్లా సంస్కృతి, సంప్రదాయం,వారసత్వంప్రతిబింబించేలా నిర్మించాలని విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
1,100 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని దాదాపు 1,100 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో 415 ఎకరాలు ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అఽథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో ఉండగా.. మరో 700 ఎకరాలు సేకరించనున్నారు. ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 నవంబరు 3న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. ఈ భూసేకరణకు రూ.368 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల మళ్లింపునకు రూ.35 కోట్లు, హైటెన్షన్ విద్యుత్ టవర్ల మళ్లింపునకు రూ.310 కోట్లు, ఈ భూముల్లో ఉన్న పలు వాగుల మళ్లింపునకు రూ.325 కోట్లు, తాగునీటి పైపుల తరలింపునకు రూ.4 కోట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపునకు రూ.19 కోట్లు కలిపి మొత్తం రూ.1,061 కోట్లు అవసరమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ ఎయిర్‌పోర్టులో దాదాపు 2.9 కిలోమీటర్ల (2,900 మీటర్లు) పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. పౌర, మిలిటరీ విమానాలు దిగేలా నిర్మించనున్న ఈ రన్‌వే కోసమే దాదాపు 900 ఎకరాల వరకు అవసరమని అంచనా. విమానాశ్రయం నిర్మాణానికి సుమారు రూ.400 కోట్ల వరకు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ విమానాశ్రయానికి విమాన రాకపోకలు అధికంగా ఉండేలా చూసేందుకు ఇంధన రాయితీ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఇక్కడ పార్కింగ్ చేసుకునే విమానాలకు ప్రస్తుతం విమానాశ్రయాల్లో ఉన్న ధరల్లో కేవలం 15 శాతమే అద్దె వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక్కడ ప్రత్యేకంగా డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పనున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ అభివృద్ధికి 10 వేల ఎకరాలు
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) కింద జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు కోసం 10 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే 6 వేల ఎకరాలను గుర్తించింది. ఇక్కడ వ్యవసాయ, డిఫెన్స్ రంగాల పరిశ్రమలు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తోంది. రక్షణ రంగ విమానాల తయారీకి చెందిన 4 కంపెనీలు జిల్లాకు రానున్నట్టు తెలిసింది.