తెలంగాణ చూపు.. బీజేపీ వైపు
ABN , Publish Date - May 10 , 2026 | 05:28 AM
తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గత బీఆర్‌ఎస్ దుష్పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..
బీఆర్‌ఎస్ దుష్పరిపాలన, కాంగ్రెస్ అసమర్థపాలనతో ప్రజలు విసిగిపోయారు
తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్.. ఆదివారం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడి
నేడు మధ్యాహ్నం రాష్ట్రానికి మోదీ.. ఐదు గంటలపాటు హైదరాబాద్‌లో పర్యటన
రూ.9,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో మోదీతో కలిసి పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాయంత్రం పరేడ్‌గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం.. నిఘా నీడలో హైదరాబాద్
2 వేల మందితో బందోబస్తు.. సభకు రెండు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా
హైదరాబాద్/సిటీ, మే 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గత బీఆర్‌ఎస్ దుష్పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని.. అందుకే వారు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఆదివారం రాష్ట్రానికి రానున్న ప్రధాని.. తన పర్యటన షెడ్యూల్‌ను తెలుపుతూ శనివారం రాత్రి తెలుగులో ట్వీట్ చేశారు. ‘నేను రేపు కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని సుమారు రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన తదితర రంగాలకు సంబంధించినవి. సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్‌ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ.. బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టంచేస్తోంది’ అని ట్వీట్ చేశారు.
మోదీ పర్యటనకు భారీగా బందోబస్తు
ప్రధాని మోదీ ఆదివారం దాదాపు 5 గంటలపాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. మోదీ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ కోసమే రెండువేల మంది పోలీసులను నియమించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి శనివారం తెలిపారు. సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో బందోబస్తు, భద్రత ఏర్పాట్ల వివరాలను ఆమె వెల్లడించారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రాంతాల రహదారులను సీసీటీవీ నిఘాలో ఉంచామన్నారు. సభ ముగిసేవరకు ప్రైవేటు వ్యక్తులు డ్రోన్‌లు ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 8712662999 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు, 226 మంది ఎస్సైలు, 61 మంది పీడీఎస్పీలు,ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు 12 బెటాలియన్ ప్లాటూన్స్, 6 ఏఆర్ ప్లాటూన్స్, అక్టోపస్ బృందాలు, ఐటీ సెల్, ఎస్‌ఓటీ ఇంటెలిజెన్స్, షీటీమ్‌లు, బాంబు నిర్వీర్య దళాలు, స్నిఫర్ డాగ్ బృందాలతోపాటు 620 మంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొంటున్నారని సీపీ తెలిపారు.
సభా ప్రాంగణంలోకి ఈ వస్తువులు నిషిద్ధం..
ప్రధాని సభా ప్రాంగణంలోకి ల్యాప్‌టా్‌పలు, కెమోరాలు, డ్రోన్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, సిగిరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెర్ఫ్యూమ్‌లు, హెల్మెట్‌లు, ఆహార పదార్థాలకు అనుమతి లేదని సీపీ తెలిపారు. మైదానం చుట్టూ వీధి వ్యాపారాలను నిషేధించినట్లు చెప్పారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
సభ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ చెప్పారు. సభకు హాజరవుతున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు 12 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. వాటి స్థానాలను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ స్టేడియం పార్కింగ్‌లో నిలిపి.. పరేడ్ గ్రౌండ్ వరకు మెట్రో రైల్‌లో వెళ్లాలని సూచించారు.
బేగంపేట నుంచి వెళ్లే వాహనదారులు సంగీత్ చౌరస్తా, ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లవచ్చు.
సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి, క్లాక్‌టవర్, పాట్నీ సెంటర్ మీదుగా వెళ్లవచ్చు.
సింధు ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించనున్నందున ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్, శిల్పారామం, హైటెక్స్, యశోద ఆస్పత్రి నుంచి సింధు ఆస్పత్రి వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదీ...
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 3 గంటలకు హెచ్‌ఐసీసీకి వెళ్తారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమంలో రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 3.40 గంటలకు హైటెక్ సిటీలో సింధు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. అటు నుంచి మాదాపూర్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శిస్తారు. తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. 6.25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరి వెళ్తారు.హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) తెలంగాణ రీజినల్ అధికారి ఏ.కృష్ణప్రసాద్ సీఎంను శనివారం ఆహ్వానించారు.
ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే..
హైదరాబాద్ - పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా 80 కి.మీ.ల మేర ఎన్‌హెచ్-167 (రూ.3,180 కోట్లు) విస్తరణ పనులకు, జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు (రూ.2,360 కోట్లు)కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.1,250 కోట్లతో పూర్తిచేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును, రూ.610 కోట్లతో చేపట్టిన మల్కాపూర్ గ్రీన్‌ఫీల్డ్ పెట్రో టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట ఆర్‌యూబీ (రూ.300 కోట్లు), పీఎంమిత్ర పార్క్ (రూ.1,700 కోట్లు)ను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
సభపైనే అందరి దృష్టి
బెంగాల్‌లో బీజేపీ ఘనవిజయం తర్వాత.. బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణేనని భావిస్తున్న వేళ ప్రధాని మోదీ ఆదివారం నాటి సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అస్సాం, బెంగాల్ గెలుపుతో జోష్‌లో ఉన్న బీజేపీ శ్రేణులు ప్రధానికి అసాధారణ స్థాయిలో స్వాగతం పలికి బలప్రదర్శన చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే సభకు భారీ జనసమీకరణలో తలమునకలుగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా బీజేపీ జెండాలు, బ్యానర్లు, వాల్‌రైటింగ్‌లే కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీపై ప్రధాని సభా వేదికగా విరుచుకుపడతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు మోదీ సభ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు.