Share News

నాతో కలవండి!

ABN , Publish Date - May 11 , 2026 | 05:39 AM

‘‘సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. నేను కూడా మాట్లాడను. కానీ, రేవంత్‌రెడ్డికి చెబుతున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో..

నాతో కలవండి!

  • మన్మోహన్‌ గుజరాత్‌కు ఇచ్చినట్టు తెలంగాణకు నిధులిచ్చేందుకు సిద్ధం

  • అలాగైతే ఇప్పుడొచ్చే నిధుల్లో సగమే వస్తాయి.. రేవంత్‌ వింటున్నారా!

  • ఉమ్మడి ఏపీలో రైల్వేలకు వెయ్యి కోట్లలోపే.. ఇప్పుడిక్కడే 5500 కోట్లు

  • రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి: ప్రధాని మోదీ

  • హెచ్‌ఐసీసీ వేదికగా రూ.9400 కోట్ల పనులకు వర్చువల్‌గా

  • శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. నేను కూడా మాట్లాడను. కానీ, రేవంత్‌రెడ్డికి చెబుతున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో.. అన్ని నిధులు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, అలా చేస్తే.. ప్రస్తుతం మీకు అందుతున్నది కాస్తా సగం అయిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో.. అక్కడికి చేరుకోలేరు. అందుకే నాతోనే కలవండి (మేరే సేహీ జుడో)’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌లో రూ.9,400 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉండటం సహజమన్నారు. అయితే దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధి చాలా ముఖ్యమని, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదని అన్నారు. అందుకే రెండింటినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగుతామని, దాంతోనే 2047 వికసిత భారత్‌ కల నెరవేరుతుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో సైబరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోందని, అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయని చెప్పారు. సైబరాబాద్‌ సామర్థ్యం కేవలం దేశానికే పరిమితం కాదని, ఇది గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణను దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చేందుకు అనేక ప్రాజెక్టులు నేడు ప్రారంభమయ్యాయన్నారు. సైబరాబాద్‌ అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని, సైబర్‌ టెక్నాలజీ, విద్యుత్‌, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.


దేశంలో సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌..

ప్రస్తుతం భారత దేశంలో రిఫార్మ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా కేవలం ఒక పారిశ్రామిక ప్రాంతం కాదని, స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌ సరఫరా, అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌తో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఇది ఆకర్షిస్తోందని చెప్పారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. భారత ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వస్త్ర పరిశ్రమ, ఆ పరిశ్రమ ఉద్యోగుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. భారతదేశ వారసత్వాన్ని పునరుద్ధరించడానికే వరంగల్‌లో పీఎం మిత్ర పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే వస్త్ర విప్లవానికి ఇది నాంది పలుకుతుందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. దేశంలో సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన హైవేలను నిర్మిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ రెట్టింపయిందని చెప్పారు. దీంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు.


రేవంత్‌ జీ.. వింటున్నావా?

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువగా ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సుమారు రూ.5500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘రేవంత్‌ జీ.. వింటున్నావా!’ అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వందే భారత్‌ రైళ్లు, ఆరు అమృత్‌ భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టు, కాజీపేట రైల్‌ అండర్‌ బైపాస్‌ లైన్‌.. రవాణా వేగాన్ని పెంచుతుందన్నారు. మల్కాపూర్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కొత్త టెర్మినల్‌ ప్రారంభించడం ద్వారా తెలంగాణ శక్తి అవసరాలు తీరుతాయని, సప్లై చైన్‌ బలపడుతుందని అన్నారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. సీఎన్‌జీ ఆధారిత గ్యాస్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రస్తుతం యువత ఎన్నో కలలు కంటోందన్నారు. యువత, రైతుల కలల్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా సన్మానించి, నంది మెమెంటోను బహూకరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రత్యేకమైన శాలువా, శ్రీ రాముడి జ్ఞాపికను ప్రధానికి బహూకరించారు.


‘కలవండి’పై అంతటా చర్చ!

ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ‘నాతో కలవండి’ అంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. అటు సోషల్‌ మీడియాలో, ఇటు ముఖాముఖి చర్చల్లోనూ దీనిపైనే చర్చ నడిచింది. మోదీ ఆ మాట ఎందుకు అన్నారోనని, ఆయన అన్నారంటే దాని వెనుక ఏదో అర్ధం, ఉద్దేశం ఉండే ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ సభలోనూ మోదీ ప్రసంగం కంటే కూడా ‘నాతో కలవండి’ అనే మాటపైనే ఎక్కువమంది ఆసక్తిగా మాట్లాడుకున్నారు. గుజరాత్‌కు ఆనాడు ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదని చెప్పడం కోసమే ఆ మాట అన్నారా? లేక నిజంగానే వేరే ఉద్దేశంతో అన్నారా.? లేదంటే సరదాగా అన్నారా.? అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - May 11 , 2026 | 05:40 AM