హైటెక్ హంగులతో రైల్వేస్టేషన్
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:49 AM
‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’లో భాగంగా కేంద్రం రూ.26 కోట్లతో పునరాభివృద్ధి చేసిన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ భవనం శుక్రవారం ప్రారంభమైంది.
హైటెక్‌సిటీ స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని
హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’లో భాగంగా కేంద్రం రూ.26 కోట్లతో పునరాభివృద్ధి చేసిన హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ భవనం శుక్రవారం ప్రారంభమైంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన మరో 74 రైల్వే స్టేషన్లను పంజాబ్‌లోని జలంధర్ రైల్వే ేస్టషన్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైటెక్‌సిటీ నూతన రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఏవీఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డీఆర్‌ఎం గోపాలక్రిష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హైదరాబాద్ బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందన్నారు. గతంలో రైల్వే స్టేషన్ అంటే పాత భవనాలు, కనీస వసతులు లేని ప్రదేశాలుగా భావించేవారమని, కానీ నేడు ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా, విమానాశ్రయాలను తలపించేలా వాటిని సుందరీకరించామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన బ్రాడ్‌గేజ్ పనులు పూర్తయితే, రైల్వే వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయన్నారు. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, భవిష్యత్తులో మూడు బుల్లెట్ రైళ్లు, మూడు హైస్పీడ్ రైళ్ల కారిడార్లు రాబోతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంతో పోల్చితే దేశంలో రైల్వే వ్యవస్థ భారీగా రూపాంతరం చెందిందన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హైటెక్‌సిటీ కొత్త స్టేషన్ భవ నాన్ని మెరుగైన వెయిటింగ్ హాళ్లు, సైనేజ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేశామన్నారు. అనంతరం ‘‘నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది?’’, ‘‘అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి నేను ఏం చేస్తాను?’’ అనే అంశాలపై నిర్వహించిన చిత్రలేఖన, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.