సింధు ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని
ABN , Publish Date - May 11 , 2026 | 05:50 AM
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం మాదాపూర్‌లోని సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ధన్వంతరి ఆలయంలో...
రోబోటిక్ సర్జరీ, రేడియేషన్ యంత్రాలను ఆసక్తిగా తిలకించిన మోదీ.. పనితీరుపై ఆరా
డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని అడిగి వివరాలు తెలుసుకున్న ప్రధాని
ఆధునిక పరిజ్ఞానం వినియోగంపై ఆస్పత్రి వ్యవస్థాపకుడు పార్థసారథిరెడ్డికి అభినందన
హైదరాబాద్ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం మాదాపూర్‌లోని సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ధన్వంతరి ఆలయంలో పూజలో పాల్గొన్న ప్రధాని.. తర్వాత ప్రధాన ద్వారం వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆస్పత్రిని నెలకొల్పిన హెటిరో గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎంపీ బండి పార్థసారథిరెడ్డి దివంగత కుమార్తె కృష్ణ సింధూరికి నివాళి అర్పించారు. లాభాపేక్ష లేకుండా పేద, మధ్యతరగతి వర్గాలకు క్యాన్సర్, ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందించే సంకల్పంతో కృష్ణ సింధూరి స్మారకంగా ఈ ఆస్పత్రులను నెలకొల్పినట్టు ప్రధానికి పార్థసారథిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడును చూసిన ప్రధాని మోదీ.. స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.
ఉచిత భోజనం చాలా మంచి పని..
ఆస్పత్రిలోని చికిత్సలు, సేవల వివరాలు తెలుసుకునే క్రమంలో ‘రోగుల కుటుంబ సభ్యులు ఎక్కడుంటారు?’ అని మోదీ ప్రశ్నించగా.. రోగుల బంధువుల కోసం ప్రత్యేకంగా సౌకర్యవంతమైన ధర్మశాల నిర్మించడంతోపాటు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు పార్థసారథి వివరించారు. దీనితో చాలా మంచి పనిచేస్తున్నారని మోదీ అభినందించారు. కృష్ణ సింధూరి 2014 మే 11న కన్నుమూశారు. ఆమె స్మారకంగా హెటిరో గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీని సింధు ఆస్పత్రిని ప్రారంభిస్తారని తెలిసి కొందరు అభిమానులు రెండు, మూడు రోజుల క్రితమే అనారోగ్య సమస్యలని చెప్పి ఆస్పత్రిలో చేరినట్టు వారి స్నేహితులు వెల్లడించారు. మోదీ వస్తారని భావించారని.. కానీ ప్రధాని ఆ వార్డులకు వెళ్లకపోవడంతో నిరుత్సాహపడ్డారని తెలిపారు.
వైద్య విద్యార్థిగా మారిన మోదీ!
సింధు ఆస్పత్రిలోని రేడియేషన్, రోబోటిక్ సర్జరీ యంత్రాలను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఆ యంత్రాల పనితీరు గురించి నోరి దత్తాత్రేయుడును ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
మోదీ: ఈ రోబోటిక్ సర్జరీ యంత్రంతో రోజుకు ఎన్ని శస్త్రచికిత్సలు చేయొచ్చు?
నోరి: రోజుకు 5 నుంచి ఏడుగురికి శస్త్రచికిత్స చేయవచ్చు సర్! కొన్ని సర్జరీల్లో చేతివేళ్లు వెళ్లలేనంత సూక్ష్మతావులకు సైతం రోబోటిక్ హ్యాండ్స్‌ను పంపవచ్చు. శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే రోగిని డిశ్చార్జి చేయొచ్చు. గర్భాశయ, మూత్ర వ్యవస్థ సంబంధిత ఆపరేషన్లను ఇవి సులభతరం చేశాయి.
రోబోటిక్ సర్జరీ చేసేప్పుడు ఎక్కువసేపు స్ర్కీన్ చూడటం వల్ల వైద్యులు అలసిపోరా?
అదేమీ కష్టం కాదు. రోజువారీ ప్రాక్టీస్‌తో డాక్టర్లకు అలవాటు అవుతుంది.
యంత్రంతో రోజుకు ఎంతమందికి చికిత్స చేయొచ్చు?
సుమారు వంద మందికి చికిత్స అందించవచ్చు.ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ వారానికా? అని అడిగారు. ‘కాదు! రోజుకు వంద మందికి సర్!’ నోరి బదులివ్వడంతో మోదీ ఆశ్చర్యపోయారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా సింధు ఆస్పత్రి ఆధునిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను ఏకీకృతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశంసించారు.