తెలంగాణ ప్రగతి చక్రాలు
ABN , Publish Date - May 11 , 2026 | 06:08 AM
తెలంగాణ అభివృద్ధికి ఊతమిచ్చే మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
రాష్ట్రానికి ఇంధన భద్రత కల్పించనున్న అత్యాఽధునిక మల్కాపూర్ పెట్రో టెర్మినల్
89 ఎకరాల్లో 611 కోట్లతో నిర్మాణం
రాష్ట్ర పారిశ్రామిక రంగానికి జహీరాబాద్ నిమ్జ్ స్మార్ట్‌సిటీతో ఊతం
దేశ టెక్స్‌టైల్ రంగానికి వెన్నుదన్నుగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు
మూడింటికి ఒకేరోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని
హైదరాబాద్/ జహీరాబాద్/ఝరాసంఘం, మే 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధికి ఊతమిచ్చే మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మల్కాపూర్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన అత్యాధునిక పెట్రోలియం టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. రూ.611 కోట్లతో 89 ఎకరాల్లో నిర్మించిన ఈ టెర్మినల్ రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. ‘ఇంధన భద్రతలో తెలంగాణకు మల్కాపూర్ టెర్మినల్ కీలకం కానుంది’ అని ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ టెర్మినల్‌కు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం ఒడిశాలోని పారాదీప్ నుంచి సుమారు 1,212 కి.మీ. దూరం పైప్‌లైన్ వేశారు. రైళ్లద్వారా సరఫరా స్థానంలో పైప్‌లైన్ నిర్మించటంతో సుమారు 10 వేల కిలోలీటర్ల(కేఎల్) డీజిల్ పొదుపు కావడంతో పాటు, దాదాపు 27 వేల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాల విడుదల తగ్గినట్లు సంస్థ తెలిపింది. ఈ టెర్మినల్‌కు మొత్తం 1.65 లక్షల కేఎల్ నిల్వ సామర్థ్యం ఉంది. పెట్రోల్ (మోటార్ స్పిరిట్) 60 వేల కేఎల్, డీజిల్ (హైస్పీడ్ డీజిల్) 68 వేల కేఎల్, విమాన ఇంధనం 26 వేల కేఎల్ నిల్వ చేయవచ్చు. ఇతర ఉత్పత్తుల కోసం 11 వేల కేఎల్ నిల్వ సదుపాయం ఉందని అధికారులు తెలిపారు. 2029- 30 ఆర్థిక సంవత్సరం నాటికి రోజుకు 7,964 కేఎల్ ఇంధన సరఫరా స్థాయికి ఈ టెర్మినల్ చేరుకుంటుందని అధికారులు చెప్పారు.
టెర్మినల్ నిర్మాణ సమయంలో ఏటా 2.5 లక్షల పనిదినాలు కల్పించగా, నిర్వహణ దశలోనూ ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోందని చెబుతున్నారు. మరోవైపు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం-న్యాల్‌కల్ మండలాల పరిధిలో ఏర్పాటుచేయనున్న సమీకృత పారిశ్రామిక స్మార్ట్‌సిటీని ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. అధికారులు నిమ్జ్ కార్యాలయం వద్ద శిలాఫలకం ఏర్పాటుచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్మార్ట్‌సిటీ ఏర్పాటుతో 2029 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.74 లక్షల పైచిలుకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాగా, దేశంలోనే తొలి పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కు (వరంగల్ టెక్స్‌టైల్ పార్కు)ను కూడా ప్రధాని ఆదివారం ప్రారంభించారు. రూ.1,694.54 కోట్లతో ఏర్పా టు చేసిన ఈ పార్కు రాష్ట్రంతోపాటు దేశ టెక్స్‌టైల్ రంగానికి వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ పార్కులో వివిధ కంపెనీలు రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. 1,327 ఎక రాల్లో విస్తరించిన ఉన్న ఈ పార్కు ద్వారా దాదాపు 24,400 ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రాజెక్టులివే..
వరంగల్‌లో పీఎంమిత్ర పార్క్- సమీకృత వస్త్ర పరిశ్రమ
జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు- విలువ రూ.2360.54 కోట్లు
జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు
పనులు- విలువ రూ.3175 కోట్లు
హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పీవోఎల్ - విలువ రూ.611 కోట్లు
118 కిలోమీటర్ల కాజీపేట- విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు - విలువ రూ.1243 కోట్లు
21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వేలైన్ - విలువ రూ.292 కోట్లు