హైదరాబాదీ.. మోదీమోదీ!
ABN , Publish Date - May 11 , 2026 | 06:02 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనతో ఆదివారం హైదరాబాద్ నగరం ‘మోదీ’ నామస్మరణతో మార్మోగింది
హైదరాబాద్‌లో ఐదున్నర గంటలపాటు ప్రధాని పర్యటన
రోడ్డుమార్గంలోనే తిరుగుతూ వరుస కార్యక్రమాలతో బిజీ
సికింద్రాబాద్‌లో భారీ రోడ్‌షో.. పరేడ్‌గ్రౌండ్ సభలో ప్రసంగం
ప్రధాని ప్రయాణం పొడవునా బీజేపీ శ్రేణుల నినాదాల హోరు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనతో ఆదివారం హైదరాబాద్ నగరం ‘మోదీ’ నామస్మరణతో మార్మోగింది. ఐదున్నర గంటలకుపైగా ఆయన నగరంలో వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. ఆయన వెళ్లిన ప్రతిచోటా బీజేపీ కార్యకర్తలు, మోదీ అభిమానులు సందడి చేశారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని.. రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌లో ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు మోదీ రోడ్డు మార్గంలోనే వెళ్లారు. బేగంపేట నుంచి మొదట ఆయన హెచ్‌ఐసీసీకి వెళ్లారు. అక్కడ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రూ.9,377 కోట్లతో రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ వద్ద సింధు ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత మాదాపూర్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించారు. సుమారు 15 నిమిషాల పాటు పవన్ నివాసంలో ఉన్న మోదీ.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు. గంటకుపైగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. సాయంత్రం 6.32 గంటలకు చంద్రబాబు నివాసం నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్‌లోని బీజేపీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 6.54 నుంచి 7.36 వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 8గంటలకు తిరుగు పయనమయ్యారు. చంద్రబాబు నివాసంలో ఎక్కువ సమయం గడపడంతో బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో జరగాల్సిన మోదీ సమావేశం రద్దయ్యింది. మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీలో జోష్ వచ్చింది. బహిరంగ సభ విజయవంతం కావటంతో పార్టీ శ్రేణలు ఆనందంలో మునిగితేలుతున్నాయి. సభకు భారీగా యువత తరలి రావటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గె లుపు తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగుర వేయడానికి ఈ సభ నాంది అని పేర్కొంటున్నారు. ఇటీవల బెంగాల్‌లో ఘనవిజయం సాఽధించామని, అదే పరంపరను తెలంగాణలో కొనసాగిద్ధామని సభలో మోదీ అనగానే.. సభికులు పెద్దపెట్టున కరతాళ ధ్వనులతో సంతోషం వెలిబుచ్చారు. ఈ సభతో హైదరాబాద్ లో తమ పార్టీ బలం మరోసారి నిరూపణ అయ్యిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.