రేపు రైతుల ఖాతాల్లో పీఎం-కిసాన్ నిధులు
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:36 AM
కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం కింద ఇచ్చే నిధులు శనివారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. 23వ విడతలో భాగంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో...
బదిలీ చేయనున్న ప్రధాని మోదీ
9.44 కోట్ల మందికి రూ.18,880 కోట్లు అందజేత
నేడు వికసిత్ భారత్ రోజ్‌గార్ నిధుల పంపిణీ
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం కింద ఇచ్చే నిధులు శనివారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. 23వ విడతలో భాగంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,880 కోట్లు బదిలీ కానున్నాయి. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తిలకించనున్నారు. పశ్చిమ బెంగాల్‌కు సంబంధించినంతవరకు పీఎం ఫసల్‌యోజన సహా కొన్ని వ్యవసాయ పథకాలను కూడా ప్రారంభించనున్నారు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద ఇంతవరకు రూ.4.46 లక్షల కోట్లను రైతులకు అందజేసినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
రాష్ట్రంలో పది చోట్ల కార్యక్రమాలు
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) కింద లబ్ధిదారులకు శుక్రవారం ప్రోత్సాహక నిధులు అందజేయనున్నారు. 15 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,400 కోట్లను బదిలీ చేస్తారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ వీటిని అందజేస్తారని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఉద్యోగాలు పొందిన యువకులు, లబ్ధిపొందిన యజమానులతో ప్రధాని ముచ్చటిస్తారు. దేశవ్యాప్తంగా 200 పారిశ్రామికవాడల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ వంటి 10 కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.