Share News

Surrender of PLGA chief Deva Sukka: బర్సే దేవా లొంగుబాటు

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:41 AM

కేంద్రం విధించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టుల లొంగుబాట్లు పెరుగుతున్నాయి. తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) చీఫ్‌....

Surrender of PLGA chief Deva Sukka: బర్సే దేవా లొంగుబాటు

  • తన సైన్యంతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్‌జీఏ చీఫ్‌

  • మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి, అతడి భార్య సహా 20 మంది సరెండర్‌

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రం విధించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టుల లొంగుబాట్లు పెరుగుతున్నాయి. తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) చీఫ్‌ బర్సే సుక్కా అలియాస్‌ దేవా, పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌, ఆయన భార్య సహా 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరు అత్యంత అధునాతమైన 48ఆయుధాలను సైతం పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా.. దళ నిర్వహణ కోసం మావోయిస్టు పార్టీ అప్పగించిన రూ.20 లక్షల నగదును సైతం దేవా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇలా నగదును స్వాధీనం చేయడం దేశంలోనే తొలిసారి అని పోలీసులు పేర్కొన్నారు. పీఎల్‌జీఏ చీఫ్‌ హిడ్మా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత.. ఆ బాధ్యతను దేవా చేపట్టారు. దేవాతోపాటు లొంగిపోయిన వారిలో అతని అంగరక్షకులైన 10 మంది పీఎల్‌జీఏ సైన్యం, కంకణాల రాజిరెడ్డి అతని భార్య ఈశ్వరి(ఏపీ), అర్బన్‌ పార్టీ సభ్యుడైన దార సారయ్య ఉన్నారు.

దేవా, హిడ్మాలది ఒకే ఊరు..

దేవా, హిడ్మా ఇద్దరూ ఒకే గ్రామంలో పుట్టినవారు. హిడ్మా ప్రభావంతో 2003లో దేవా మావోయిస్టు పార్టీలో చేరారు. దాదాపు 400 మంది సభ్యులున్న పీఎల్‌జీఏలో ఒక బెటాలియన్‌కు కమాండర్‌గా వ్యవహరించేవారు. ప్రస్తుతం దేవా లొంగుబాటు తర్వాత పీఎల్‌జీఏలో అతికొద్ది మందే అక్కడక్కడ మిగిలి ఉంటారని, వీరంతా కలిపి 60 లోపే ఉంటారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. దేవా వాడుతున్న ఇజ్రాయెల్‌ తయారీ టావర్‌ రైఫిల్‌ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ పోలీసుల వద్ద కూడా లేదని, దీనిని కేంద్ర ఽభద్రతా బలగాల నుంచి ఎదురుకాల్పుల ఘటనల్లో దక్కించుకుని ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.1.90 కోట్ల రివార్డు ఉందని, ఇందులో తక్షణ సాయం కింద వీరందరికీ రూ.25 వేల చొప్పున నగదు ఇస్తున్నామని చెప్పారు. కాగా, ఆఽధునిక సాంకేతికత, కమ్యూనికేషన్‌ సదుపాయాలు మెరుగైన ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం పనిచేయదని, అడవుల్లో మిగిలిన మావోయిస్టులు వచ్చి లొంగిపోవాలని రాజిరెడ్డి కోరారు. కాగా, పీఎల్‌జీఏ బృందాలు పోలీసులకు అప్పగించిన ఆయుధాల్లో అత్యంత ఆధునాతనమైన రెండు లైట్‌ మెసిన్‌గన్లు, అమెరికన్‌ తయారీ కోల్ట్‌ రైఫిల్‌-1, ఇజ్రాయెల్‌ తయారీ టావర్‌ సీక్యూబీ-1, ఏకే 47 రైఫిళ్లు-8, ఇన్సాస్‌ రైఫిళ్లు-10, ఎస్‌ఎల్‌ఆర్‌లు-8, గ్రనేడ్‌ లాంచర్లు-4, సింగిల్‌ షాట్‌ తుపాకులు- 11, గ్రనేడ్స్‌-2, ఒక ఎయిర్‌గన్‌తోపాటు 93 మ్యాగజైన్లు, 2,206 తూటాలు ఉన్నాయి.


తెలంగాణ నుంచి మరో 17 మంది మాత్రమే..

మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 17 మంది పనిచేస్తున్నారు. ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరిలో గణపతి, రాజిరెడ్డి యాక్టివ్‌గా లేరని, సేఫ్‌ షెల్టర్‌లో ఉన్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పసునూరి నరహరి, తిరుపతి ఇద్దరూ జార్కండ్‌లో ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. రాష్ట్ర కమిటీ సభ్యులైన ముప్పిడి సాంబయ్య అలియాస్‌ సుదర్శన్‌, వార్తా శేఖర్‌, నక్కా సుశీల, జోడే రతన్‌బాయి, లోకేటి చందర్‌రావు, బడే చొక్కారావు, జాదీ పుష్ప, రంగబోయిన భాగ్య, బడిసె ఉంగ, మాడ్వి అడిమె, భవానీ, అనిల్‌కుమార్‌.. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. వీరిలో జోడే రతన్‌బాయి గణపతి భార్య కావడంతో.. ఆమె సైతం సేఫ్‌ షెల్టర్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Updated Date - Jan 04 , 2026 | 04:41 AM