Share News

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:31 PM

గ్రామాల అభివృద్ధికి గ్రామసభలలో అవసరమైన పనులను గుర్తించి అభివృద్ది చర్యలు చేపట్టే ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సంబంధితశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని గ్రామపంచాయతీలలో వీబీజీ రాంజీ పథకం ద్వారా వికసిత్‌ గ్రామ పంచాయతీ కింద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు

kumaram bheem asifabad- గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ హరిత, అధికారులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి గ్రామసభలలో అవసరమైన పనులను గుర్తించి అభివృద్ది చర్యలు చేపట్టే ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సంబంధితశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని గ్రామపంచాయతీలలో వీబీజీ రాంజీ పథకం ద్వారా వికసిత్‌ గ్రామ పంచాయతీ కింద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వీబీజీ రాంజీ పథకం ద్వారా గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి గ్రామసభల ద్వారా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామాల్లో జనాభా పెరుగుదల, గ్రామాలు విస్తరిస్తున్నందున ప్రజలకు అవసరమయ్యే పనులను గుర్తించాలని తెలిపారు. వీబీజీ రాంజీ పథకం కింద 370 రకాల పనులు చేపట్టవచ్చన్నారు. అవసరమైన పనులను గుర్తించాలని చెప్పారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికలో వారు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించడంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవోభిక్షపతి, సంబందితశాఖల అధికారులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గొడవెల్లి వద్ద పెద్దవాగు వినాయక నిమజ్జన ప్రదేశాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయకులను తీసుకువచ్చే మార్గంలో వర్షాల వల్ల రహదారి బురదమయంగా మారిందన్నారు. రహదారపై గుంతలను పూడ్చాలన్నారు. నిమజ్జన ప్రదేశం వద్ద వెలుతురు ఉండేలా అవసరమైతే జనరేటర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పోలీసు బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, కమీషనర్‌ అంజయ్య, తహసిల్థార్‌ రీయాజ్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Sep 24 , 2026 | 10:31 PM