Share News

విద్యార్థుల హాజరు పెంపునకు ప్రణాళిక

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:20 AM

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి బడులకు దూరమవుతున్న చిన్నారులను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నవంబరు నెలను ప్రత్యేక హాజరు నెల-వందశాతం హాజరు డ్రైవ్‌గా

విద్యార్థుల హాజరు పెంపునకు ప్రణాళిక

జగిత్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి బడులకు దూరమవుతున్న చిన్నారులను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నవంబరు నెలను ప్రత్యేక హాజరు నెల-వందశాతం హాజరు డ్రైవ్‌గా ప్రకటించింది. ఈ మేరకు నవంబరు1 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సమగ్ర శిక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల హాజరును కూడా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా ప్రతి రోజూ నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 810 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 67 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 4,200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

ఫవారానికోసారి ప్రత్యేక పరిశీలన

పాటశాలలకు వరుసగా ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి తొలుత తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కారణాలు తెలుసుకోవాలి. అవసరమైతే ఉపాధ్యాయులు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలి. విద్యార్థులు బడికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. చదువు ప్రాధాన్యతను వివరించి తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. పనిదినాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేలా, ప్రతి వారం హాజరు శాతాన్ని మెరుగుపరుచుకునేలా లక్ష్యాలను నిర్ధేశించారు.

ఫసాంకేతిక సమస్యలకు చెక్‌..

పాఠశాలల్లో హాజరు నమోదులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యాశాఖ ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న ఓడీ ఎంట్రీలను 24 గంటల్లోగా క్లియర్‌ చేయాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరికరాలు, నెట్‌ వర్క్‌, హాజరు నమోదుకు సంబంధించిన సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి. జిల్లా, మండల, క్లస్టర్‌ స్థాయిల్లో అధికారులు రోజువారీ హాజరును పర్యవేక్షించడంతో పాటు వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. ఎక్కడైనా హాజరు శాతం తగ్గితే అందుకు గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలి.

ఫప్రశంసాపత్రాలతో సత్కారం..

విద్యార్థుల హాజరు పెంపులో తల్లిదండ్రులను భాగస్వాములను చేయనున్నారు. పేరెంట్స్‌, పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల క్రమబద్ధమైన హాజరుపై అవగాహన కల్పించాలి. గ్రామాల్లోనూ ప్రచారం చేపట్టి సమాజ భాగస్వామ్యంతో బడికి వచ్చే పిల్లల సంఖ్యను పెంచాలి. ఈ కార్యక్రమంలో పనితీరు కనబరిచిన పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వంద శాతం హాజరు సాధించిన ప్రధానోపాధ్యాయులను ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు.

ఫపనితీరుపై నెలాఖరులో సమీక్ష..

నవంబరు 22 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి పనితీరును క్రోడీకరించి తుది సమీక్ష నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించి హాజరు శాతం పెంపులో సాధించిన పురోగతిని అంచనా వేస్తారు. అనంతరం విద్యా సంవత్సరం మొత్తం ఇదే విధానాన్ని కొనసాగించేలా ప్రణాళిక రూపొందించనున్నారు.

విద్యార్థుల హాజరును పర్యవేక్షించాలి

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

నెలాఖరు వరకు హాజరుపై ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతుంది. ఎంఈవోలు, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజూ పర్యవేక్షించాలి. విద్యార్థుల హాజరుపై ప్రతీ వారం సమీక్షలు చేపట్టాలి. వంద శాతం హాజరు లక్ష్యం సాధించేందుకు ఉపాధ్యాయులు సహకరించాలి.

Updated Date - Nov 04 , 2026 | 01:20 AM