23 నుంచి రాజేంద్రనగర్‌లో విత్తన వారోత్సవాలు
ABN , Publish Date - May 17 , 2026 | 05:27 AM
రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్వాన ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.
వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రొ. అల్దాస్ జానయ్య
రాజేంద్రనగర్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్వాన ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ వారోత్సవాల్లో నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. విశ్వవిద్యాలయంలో మూల విత్తనం పరిమితమైన పరిమాణంలో ఉన్నందున మే 18 నుంచి 22 వరకు ఆయా జిల్లాల రైతాంగం విశ్వవిద్యాలయ విక్రయ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వర్సిటీ కేంద్రాల్లో దాదాపు 1,50,000 మంది రైతులకు సరిపోను వివిధ రకాల 1,231 టన్నుల విత్తనాలను అమ్మకానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు. అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకున్న రైతాంగానికి ఇవ్వగా.. మిగిలిన విత్తనాలను ఈ నెల 23 నుంచి జరిగే విత్తన మేళాలో అందజేస్తామని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు శనివారం ఓప్రకటనలో జానయ్య పేర్కొన్నారు.