వాటా బదిలీని అడ్డుకోవడం సరికాదు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:49 AM
రష్యాకు చెందిన అల్యూమినియం దిగ్గజ కంపెనీ రుసాల్‌కు షేర్ల బదిలీని అడ్డుకునే విధంగా రస్ అల్ ఖైమా ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ(రాకియా) వాణిజ్య కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొంటూ ...
రాకియాపై హైకోర్టును ఆశ్రయించిన పయనీర్ అల్యూమినియం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : రష్యాకు చెందిన అల్యూమినియం దిగ్గజ కంపెనీ రుసాల్‌కు షేర్ల బదిలీని అడ్డుకునే విధంగా రస్ అల్ ఖైమా ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ(రాకియా) వాణిజ్య కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొంటూ పెన్నా గ్రూప్‌నకు చెందిన కంపెనీ పయనీర్ అల్యూమినియం ఇండస్ర్టీస్ లిమిటెడ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కంపెనీ అయిన పయనీర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయి వాదిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా రాకియా దాఖలు చేసిన పిటిషన్‌ను వాణిజ్య కోర్టు అనుమతించిందని.. ఈ మేరకు వాణిజ్య కోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని కోరారు. మరోవైపు రాకియా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్. రవి వాదనలు వినిపిస్తూ.. వాణిజ్య కోర్టు ప్రొసీడింగ్స్‌లో ఈ దశలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ కేసుకు సంబంధించి వాణిజ్య కోర్టు ప్రొసీడింగ్స్ తుది దశకు చేరినందున ప్రొసీడింగ్స్‌ను అడ్డుకోలేమని పేర్కొంది. అయితే ప్రస్తుత అప్పీల్‌లో తాము తీర్పు ఇచ్చే వరకు వాణిజ్య కోర్టు తీర్పు ఇవ్వరాదని వాణిజ్య కోర్టుకు ఆదేశాలిచ్చింది.