డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా?
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:12 AM
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విషయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు దాదాపు నెల రోజులుగా నిఘా పెట్టిన తరువాతే.....
పైలట్ రోహిత్‌రెడ్డి, సహచరులపై అనుమానం.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఫాంహౌస్‌లో పట్టుబడిన మహిళపైనా ఫోకస్
కాల్పులు జరపాలంటూ పురిగొల్పిన ఓ వ్యక్తి
అతడు రోహిత్‌రెడ్డేనా? అనే కోణంలో విచారణ
నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్‌కు సన్నాహాలు
డ్రగ్స్ పార్టీలో ఇంకా ఎవరైనా పాల్గొని వెళ్లారా?
ఇంకా రావాల్సి ఉండి రానివారు ఎవరెవరు?
రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ను విచారించిన పోలీసులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/మొయినాబాద్)
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విషయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు దాదాపు నెల రోజులుగా నిఘా పెట్టిన తరువాతే.. పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 13న తాండూరులో మునిసిపల్ ఎన్నికల ఫలితాల రోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా ఆయన సీఐ సంతోష్‌కుమార్‌ను నెట్టివేశారు. ఆ సమయంలో ఆయన ప్రవర్తనపై పోలీసులకు అనుమానాలు వచ్చాయి. తొలుత మద్యం సేవించారని భావించినప్పటికీ.. తరువాత విచారణలో ఆయన ‘మద్యం కానిది ఏదో’ తీసుకున్నట్లు అనుమానపడ్డారు. దీనికితోడు రోహిత్‌రెడ్డిపై నిఘా పెడితే సంచలన విషయాలు బయటపడతాయని ఇద్దరు రాజకీయ నేతలు పోలీసులకు కీలక సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో అప్పటి నుంచి పోలీసులు రోహిత్‌రెడ్డిపై నిఘా పెట్టి డ్రగ్స్ తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడ వెల్లడైన అంశాల నేపథ్యంలో రోహిత్‌రెడ్డి, ఆయనతోపాటు ఉన్నవారు డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే బెంగుళూరులో డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన ఎప్పటికప్పుడు తనకున్న పరిచయాలతో ఈ వివాదాల నుంచి బయటపడుతూ వచ్చారు. చివరకు తన ఫాంహౌస్‌లోనే దొరికిపోయారు. మరోవైపు ఆయనతోపాటు పట్టుబడిన ప్రియాంకరెడ్డి అనే మహిళపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. గతంలో ఇదే పేరు కలిగిన మహిళ.. హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో ఉన్నారు. అయితే ఆమె, ఈమె ఒకరేనా? అనే విషయం ఇంకా తెలియడం లేదు. ఇంటిపేర్లు తేడా ఉండడంతో స్పష్టత రావాల్సి ఉంది.

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
మొయినాబాద్ ఎస్సై నయీముద్దీన్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక వివరాలను పోలీసులు ప్రస్తావించారు. దాని ప్రకారం.. ఈ నెల 14వ తేదీ రాత్రి 8గంటల సమయంలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలతో పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మొయినాబాద్ పోలీసులు రాత్రి 9:05 గంటలకు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలోకి వెళ్లగానే లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిది. దీంతో తాము ప్యూచర్ సిటీ పోలీసులమని, కాల్పులు జరవద్దని గట్టిగా హెచ్చరించారు. అయినా వారు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. లోపల ఉన్న ఓ వ్యక్తి, ‘అంతా నేను చూసుకుంటాను.. కాల్పులు జరపండి’ అని వారిని పురిగొల్పాడు. అతడు రోహిత్‌రెడ్డేనా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఆ తరువాత పోలీసులు మరోసారి గట్టిగా హెచ్చరించడంతో కాల్పులు ఆగాయి. అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్ద సెర్చ్ వారెంట్‌ను రోహిత్‌రెడ్డికి ఇచ్చి రివాల్వర్‌తో ఉన్న నమిత్ శర్మ నుంచి (జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32) దానిని స్వాధీనం చేసుకున్నారు. రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డికి ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను అతని వద్ద నుంచి తీసుకొని నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. సిలివేరు శరత్‌కుమార్ నుంచి బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఫాంహౌస్‌లో ఒక మహిళతోపాటు 10 మందిని అధీనంలోకి తీసుకున్నారు. వీరందరినీ విడివిడిగా విచారించారు. ముందు వీరంతా తాము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించారు. అయితే అక్కడ ఆధారాలన్నీ లభించడంతో తరువాత అంగీకరించారు. తొలుత రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్‌కుమార్.. డ్రగ్స్ ఉన్నట్లు అంగీకరించాడు. తన జేబులో ఉన్న కొకైన్ తీసి పోలీసులకు ఇచ్చాడు. దీనిని రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తీసుకువచ్చినట్లు తెలిపాడు.
దీంతో 11 మందికి డ్రగ్ లైవ్ కిట్స్ ద్వారా యూరిన్ టెస్టులు చేశారు. ఇందులో కొందరికి పాజిటివ్ వచ్చింది. తరువాత వీరందరికీ రక్తపరీక్షలు నిర్వహించగా.. మరికొందరికి పాజిటివ్ వచ్చింది. యూరిన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి కూడా రక్తపరీక్షల్లో పాజిటివ్ రావడం గమనార్హం. కాగా, రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కావాలని కోరడంతోనే తాను సిమ్లా నుంచి తీసుకొచ్చానని కౌశిక్ రవి.. పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. కొందరు అపరిచిత వ్యక్తుల ద్వారా గ్రాముకు రూ.15 వేల చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేశానని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వాస్తవముందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ఫాంహౌస్‌కు బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్టా మహేశ్, పైలట్ రోహిత్‌రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి కొకైన్ తీసుకున్నట్లుగా నిర్ధారణ పరీక్షలో తేలిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరంతా ఈ పార్టీలో మద్యంలో కొకైన్ కలుపుకొని తాగినట్లు తెలిపారు.
డ్రగ్స్ మూలాలపై పోలీసుల కూపీ...
మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీలో దొరికిన డ్రగ్స్ మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు సోమవారం టీమ్‌లను ఏర్పాటు చేశారు. నిందితులందరినీ విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సోమవారం రోహిత్‌రెడ్డి కారు డ్రైవర్‌ను పిలిచి విచారించినట్లు తెలిసింది. దీంతోపాటు రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన పార్టీ రొటీన్‌గా జరిగిదేనా? లేక ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేశారా? వారందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనే విషయాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫాంహౌస్‌పై తాము దాడి చేయడానికి ముందు పార్టీకి ఎవరైనా వచ్చి వెళ్లారా? ఇంకా ఎవరైనా హాజరు కావాల్సిన వారు ఉన్నారా? అనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ పార్టీ ఓ ముఖ్యమైన బిజినెస్‌డీల్‌కు సంబందించి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ పార్టీలో పాల్గొనాల్సి ఉందని, పోలీసుల దాడి విషయం బయటకు రావడంతో వారు రాలేదని సమాచారం. ఈ విషయాన్ని నిందితులు పోలీసుల విచాణలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై దాడి జరిగిన రోజు నుంచి ప్రత్యేక నిఘా పెట్టారు. అక్కడికి ఎవరెవరు వస్తున్నారనే విషయం తెలుసుకోవడంతోపాటు గతంలో ఇక్కడ పార్టీలు జరిగిన సమయంలో ఎవరెవరు వచ్చేవారనే వివరాలనూ సేకరిస్తున్నారు.