మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:18 AM
బీఆర్‌ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఓ చెక్ బౌన్స్‌లో దోషిగా తేలిన ఆయన..
వికారాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయింది. ఓ చెక్ బౌన్స్‌లో దోషిగా తేలిన ఆయన.. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో గైర్హాజరయ్యారు. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. మెసర్స్ ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రోహిత్‌రెడ్డి ఆ కంపెనీకి రూ.34.23 లక్షలు చెల్లించడానికి చెక్కు ఇచ్చారు. అయితే, సంబంధిత బ్యాంకు ఖాతాలో నిధులు లేకపోవడంతో ఆ చెక్కు మూడు సార్లు బౌన్స్ అయింది. దీంతో ఆ కంపెనీ బాధ్యులు రోహిత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సదరు కంపెనీ బాధ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో తన వాదనను నిరూపించుకోవడంలో రోహిత్‌రెడ్డి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. కానీ, తీర్పు వెలువరించే సమయంలో రోహిత్ రెడ్డి గైర్హాజరవ్వడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయన్ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశముంది. రోహిత్ రెడ్డి కోర్టులో హాజరైన తర్వాత చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది.