Share News

పిల్‌ అంటే ‘పైసా ఇన్‌కం లిటిగేషన్‌’గా మార్చారు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:38 AM

న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని గడీల రఘువీర్‌రెడ్డి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు ఆరోపించారు.

పిల్‌ అంటే ‘పైసా ఇన్‌కం లిటిగేషన్‌’గా మార్చారు

  • కోర్టులను అడ్డంపెట్టుకుని వసూళ్ల దందా

  • రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించిన కేసులో కేకే కుమారుడి వాదనలు

  • పిల్‌ వేశానన్న కోపంతోనే కేసు పెట్టారన్న పిటిషనర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని గడీల రఘువీర్‌రెడ్డి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) కాస్తా ‘పైసా ఇన్‌కం లిటిగేషన్‌’గా మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తమ పేరుపై భూమి క్రమబద్ధీకరించిందనే నెపంతో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసి రూ.3 కోట్లు ఇస్తే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేకే కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె గద్వాల విజయలక్ష్మికి అతితక్కువ ధరకు బంజారాహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌లో ప్లాట్లు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 56ను కొట్టేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని రఘువీర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నారంటూ వెంకటేశ్వరరావు బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ రఘువీర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రఘువీర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ.. వెంకటేశ్వరరావుకు భూమిని క్రమబద్ధీకరించడాన్ని సవాలు చేస్తూ పిల్‌ దాఖలు చేశారన్న కోపంతోనే కేసు పెట్టారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరారు. వెంకటేశ్వరరావు తరఫున న్యాయవాదులు శ్రీపాద ప్రభాకర్‌, ఎన్‌.కృష్ణకుమార్‌ గౌడ్‌ వాదిస్తూ.. రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడు తప్పుడు పిటిషన్లతో న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తే దర్యాప్తు నిలిచిపోయి, వాస్తవాలు బయటకు రావని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Feb 24 , 2026 | 04:38 AM