డయాలసిస్ సెంటర్లలో సౌకర్యాల లేమిపై ‘పిల్’
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:41 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దాదాపు 102 డయాలసిస్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంపై హైకోర్టులో ‘పిల్’ దాఖలయింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దాదాపు 102 డయాలసిస్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంపై హైకోర్టులో ‘పిల్’ దాఖలయింది. ఓ న్యాయవాది రాసిన లేఖనే ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేంద్రాలను పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఒక్కో వినియోగదారునికి 1950 చొప్పున చెల్లిస్తున్నా తగిన సేవలు అందడం లేదని పిటిషనర్ తెలిపారు.
సమగ్ర శిక్షా పథకంలో అక్రమాలపై పిల్..
పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా), సమగ్ర శిక్షా పథకంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్‌లో భాగంగా సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని పిటిషనర్ తెలిపారు. 946 పాఠశాల్లో ఈ పనుల కోసం బిడ్డింగ్ పక్రియ నిర్వహించగా, 500 పాఠశాలలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు భారీగా లంచాలు తీసుకుని ప్రభుత్వానికి, ఒకేషనల్ విద్యార్థులకు నష్టం కలిగించారని ఆరోపించారు. విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. మూడువారాల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.