Share News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎస్‌

ABN , Publish Date - May 30 , 2026 | 04:43 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తుది చార్జిషీట్‌ దాఖలుకు కసరత్తు చేస్తున్న సిట్‌ అధికారులు.. నిందితుల పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను పక్కాగా సేకరిస్తున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎస్‌

  • సోమేశ్‌ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు?

  • ప్రభాకర్‌ రావును సీవోవోగా నియమించింది ఆయనే.. ఉత్తర్వుల్లో ఉన్నది సోమేశ్‌ సంతకమే

  • డీజీపీ సిఫారసుకు భిన్నంగా వచ్చిన ఉత్తర్వులు

  • ఐపీఎస్‌ క్యాడర్‌ రూల్స్‌కు విరుద్ధంగా పోస్టింగ్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తుది చార్జిషీట్‌ దాఖలుకు కసరత్తు చేస్తున్న సిట్‌ అధికారులు.. నిందితుల పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను పక్కాగా సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పేరు నిందితుల జాబితాలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఐజీగా పనిచేసిన ప్రభాకర్‌ రావు 2020 జూన్‌లో రిటైర్‌ అయ్యారు. ఆ సమయంలో డీజీపీ కార్యాలయం నుంచి ఒక కీలక నోట్‌ ప్రభుత్వానికి వెళ్లింది. ఎస్‌ఐబీలో ప్రభాకర్‌రావు సేవల అవసరం ఉన్నందున ఆయన్ను ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా తీసుకోవాలని సిఫారసు చేస్తూ నాటి డీజీపీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అయితే, వచ్చిన ఉత్తర్వులను చూసి అప్పటి డీజీపీతో సహ పోలీసు ఉన్నతాధికారులంతా దిగ్ర్భాంతి చెందారు. ప్రభాకర్‌ రావును పోలీసుశాఖలో అప్పటి వరకూ లేని ఓ కొత్త పోస్టులో.. ‘చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ (సీవోవో), ఇంటెలిజెన్స్‌, ఎస్‌ఐబీ’గా నియమిస్తున్నట్లు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాపింగ్‌ నేరంలో సోమేశ్‌ కూడా పాత్రధారి అనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ ఉత్తర్వే సిట్‌ అధికారులకు ఆయుధంగా మారినట్టు సమాచారం. ఐపీఎస్‌ అధికారుల క్యాడర్‌ రూల్స్‌ ప్రకారం పదవీ విరమణ తర్వాత కేవలం మూడు నెలల కాలంపాటు తాత్కాలిక పద్ధతిలో వారికి పోస్టింగ్‌ ఇవ్వవచ్చు. అలా కాకుండా ప్రభాకర్‌ రావును మూడేళ్ల కాలానికి చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా నియమించడం ఐపీఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ 7.1కు వ్యతిరేకమని.. ఆ ఉత్తర్వులు వివాదస్పదమని సిట్‌ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ప్రభాకర్‌ రావు సేవలు ఓఎ్‌సడీగా అవసరమని డీజీపీ భావిస్తే.. నాటి చీఫ్‌ సెక్రటరీ ఏకంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతలను పదవీ విరమణ చేసిన అధికారికి అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని సిట్‌ అధికారులు తమ నివేదికలో పేర్కొంటున్నారు. డీజీపీ ఇచ్చిన నోట్‌ను మార్చేసి ఉత్తర్వులు జారీ చేయడం నేరం కిందకే వస్తుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. నాటి ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చినా ఆ విషయం ఆదేశాల్లో ఉండదని, దాన్ని రుజువు చేయాలంటే ఉత్తర్వులు ఇచ్చిన అధికారి తన వాంగ్మూలంలో వాస్తవాన్ని అంగీకరించాల్సి ఉంటుందని సీనియర్‌ అధికారులు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 04:43 AM