నా ఆరువేల కాల్స్ విన్నారు..!
ABN , Publish Date - May 02 , 2026 | 05:34 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ జిల్లా అథారిటీ..
మానుకోట జిల్లా ఆర్టీఏ సభ్యుడు రావుల మురళి
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు
మహబూబాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ జిల్లా అథారిటీ (ఆర్టీఏ) సభ్యుడు రావుల మురళి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్‌కు సంబంధించిన ఆరువేల కాల్స్ విన్నట్లు విచారణాధికారులు తెలపడంతో మురళి ఆశ్చర్యానికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అనుచరుడైన రావుల మురళికి, గత నెల 24న పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన విచారణకు వచ్చారు. అనంతరం మురళి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌కు వచ్చివెళ్లిన 6 వేల కాల్స్‌ను ట్యాప్ చేసి విన్నట్లు అధికారులు రికార్డులు చూపించారని వెల్లడించారు. ఇది విని షాక్ అయ్యానని చెప్పారు. వేం నరేందర్‌రెడ్డితో ఉన్న సంబంధంపై అధికారుల ప్రశ్నించగా, చిన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన అనుచరుడిగానే కొనసాగుతున్నానని చెప్పానని మురళి వెల్లడించారు.