దొంగ డాక్టరమ్మ!
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:48 AM
వైద్యురాలి వేషంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వార్డుల్లోకి వెళ్లి మహిళా రోగులకు మత్తు ఇంజక్షన్‌లు ఇచ్చి, వారి బంగారు ఆభరణాలను దోచుకెళుతూ ఘరానా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఫార్మాడీ విద్యార్థినిని.....
వైద్యురాలి వేషంలో ఫార్మాడీ విద్యార్థిని ఘరానా చోరీలు
కార్పొరేట్ ఆస్పత్రుల్లో మహిళా రోగులకు మత్తు ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
భర్త సహకారంతో వరుస దొంగతనాలు
దంపతుల అరెస్టు..బంగారం, కారు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వైద్యురాలి వేషంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వార్డుల్లోకి వెళ్లి మహిళా రోగులకు మత్తు ఇంజక్షన్‌లు ఇచ్చి, వారి బంగారు ఆభరణాలను దోచుకెళుతూ ఘరానా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఫార్మాడీ విద్యార్థినిని పోలీసులు పట్టుకున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఆ దొంగ వైద్యురాలిని, ఆమెకు సహకరిస్తున్న ఆమె భర్తను కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, ఓ కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీసీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేటకు చెందిన గౌండ్ల శిరీష డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (పార్మా-డి) ఫైనలియర్ చదువుతోంది. శిరీషకు తల్లి లేకపోవడంతో.. చదువు పూర్తవ్వకముందే తండ్రి ఆమెకు వివాహం చేశాడు. శిరీషకు ఎడవెల్లి సాయికుమార్‌తో వివాహమవ్వగా వారికి ఓ కుమారుడు ఉన్నాడు. శిరీష చదువు కొనసాగిస్తుండగా.. వ్యాపారం చేసుకునే భర్తకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పెళ్లిలో తండ్రి పెట్టిన బంగారంతో కొంతకాలం కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఆ దంపతులు తర్వాత సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. శిరీష వైద్యురాలి వేషంలో కార్పొరేట్ ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లి మహిళా రోగులకు మత్తు మందు ఇచ్చి.. రోగులు మత్తులోకి వెళ్లాక వారి బంగారాన్ని దోచుకోవాలని దంపతులు ప్లాన్ చేశారు. శిరీష ఫార్మాడీ విద్యార్థిని కావడం, వైద్య పరిజ్ఞానం ఉండడంతో అనుకున్నట్టుగా తమ పథకాన్ని పలుమార్లు అమలు చేశారు. మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని వార్డుల్లోకి వైద్యురాలి వేషంలో వెళ్లిన శిరీష.. మహిళా రోగుల బంగారాన్ని దోచుకుని పరారైంది. ఈ ఘటనలపై దర్యాప్తు చేసిన పోలీసులు శిరీష దంపతులను అరెస్టు చేశారు. అయితే, శిరీష దంపతులు గత నెలలో అపోలో ఆస్పత్రిలో చోరీకి పాల్పడగా.. అపోలో సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయినా వారు పద్ధతి మార్చుకోలేదు. ఈ దంపతులు దొంగ సొమ్మును విలాసాలకు ఖర్చు చేసేవారని పోలీసులు గుర్తించారు.