హైకోర్టు తీర్పు తర్వాతే ‘ఫార్మసిస్ట్’ ఫలితాల వెల్లడి
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:18 AM
హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడం వల్లే ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాల విడుదలలో ఆలస్యం జరుగుతోందని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
ముందుగానే ప్రకటిస్తే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం
మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడం వల్లే ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాల విడుదలలో ఆలస్యం జరుగుతోందని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. హైకోర్టు తుది తీర్పు వెలువడకుండా ఫలితాలు ప్రకటిస్తే, నోటిఫికేషన్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఫార్మసీ అభ్యర్థులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 732 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు 2024 సెప్టెంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేయగా 27,101 దరఖాస్తులు వచ్చాయి. కంప్యూటర్ బేస్‌డ్ టెస్టును 2024 నవంబర్‌లో నిర్వహించగా, డిసెంబరులో ప్రిలిమినరీ కీ విడుదల చేసి, 2025 మే నెలలో ఫలితాలను ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సర్వీ్‌సకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఫార్మసిస్టులు.. ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనూ ఫార్మసిస్టులుగా నమోదయ్యారని, వారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో తుది తీర్పునకు లోబడే రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.