పీజీఈసెట్ ఫలితాల విడుదల..
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:01 AM
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)- 2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
94.30శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలదే పైచేయి
7 సబ్జెక్టుల్లో 100శాతం పాస్.. 5రోజుల్లోనే ఫలితాల వెల్లడి
హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)- 2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. 94.30శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు పైచేయి సాధించగా, అబ్బాయిలు 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 29 నుంచి జూన్ 1 వరకు మొత్తం 19 సబ్జెక్టుల్లో జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 23,637మంది హాజరయ్యారు. వారిలో 21,958 మంది (92.89శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. పరీక్షలు ముగిసిన ఐదు రోజుల్లోపే ఫలితాలను విడుదల చేసిన సెట్ నిర్వాహకులను బాలకిష్టారెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ శ్రీకాంత్, జేఎన్‌టీయూ రెక్టార్ విజయకుమార్ రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. మొత్తం 19సబ్జెక్టులకు గాను, ఏడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రధాన సబ్జెక్టులైన కంప్యూటర్ సైన్స్‌లో 91.43 శాతం మంది, ఫార్మసీ విభాగంలో 97.48 శాతం మంది అభ్యర్థులు పాసయ్యారు. వచ్చే ఏడాది నుంచి 100 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చే సబ్జెక్టులకు ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆయా సబ్జెక్టుల్లో పీజీఈసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కంటే కాలేజీల్లో ఎంటెక్ సీట్లే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎప్‌సెట్ కౌన్సెలింగ్ వాయిదా.!
ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని బాలకిష్టారెడ్డి చెప్పారు. ఎంబైపీసీ అభ్యర్థులు నీట్ పరీక్ష రాస్తున్నందున, వారు అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు జూన్‌లో ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించే పరిస్థితి లేదని తెలిపారు. మరోవైపు జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వర్సిటీ పరిధిలో ఉన్న 136 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇటీవల జరిగిన తనిఖీల్లో 80ు కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయా యాజమాన్యాలు తమ కాలేజీల్లోని లోపాలను సరిదిద్దుకునేందుకు శనివారం వరకు గడువు ఇచ్చామని వివరించారు.