Share News

పీజీ వైద్యుడి ఆత్మహత్యపై త్రిసభ్య కమిటీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:37 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పీజీ వైద్యుడు సురేశ్‌ ఆత్మహత్య వివాదస్పదమవుతోంది. దీంతో ఈ కేసుపై శాఖాపరమైన విచారణకు వైద్యశాఖ ఆదేశించింది.

పీజీ వైద్యుడి ఆత్మహత్యపై త్రిసభ్య కమిటీ

  • శాఖాపరమైన విచారణకు ఆదేశించిన వైద్యశాఖ

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో పీజీ వైద్యుడు సురేశ్‌ ఆత్మహత్య వివాదస్పదమవుతోంది. దీంతో ఈ కేసుపై శాఖాపరమైన విచారణకు వైద్యశాఖ ఆదేశించింది. వైద్యవిద్యా సంచాలకులు (డీఎంఈ) నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఇందిర, మానసిక చికిత్సాలయం మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాశంకర్‌, డాక్టర్‌ పెరుగు వెంకట్వేర్లు ఉన్నారు. ఈ కమిటీ హాస్టల్‌ సిబ్బంది, తోటి విద్యార్థులు, స్నేహితులు, ఆయా విభాగాల అధిపతులు, డ్యూటీ డాక్టర్లతో సంప్రదించి నివేదికను డీఎంఈకి సమర్పించనుంది. మరోవైపు తన కొడుకు డాక్టర్‌ సురేశ్‌ మృతికి సీనియర్‌ వైద్యుల వేధింపులే కారణమని మృతుని తల్లి నాగమణి అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం సురేశ్‌ స్నేహితులను పిలిచి విచారించారు. సురేశ్‌ను డ్యూటీ డాక్టర్లు, హెచ్‌ఓడీలు ఏమైౖనా వేధించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్‌ గదిలోని సీసీటీవీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదిక, ఆత్మహత్య ఉపయోగించిన ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు పీజీ వైద్యులు ఎక్కువ గంటలు డ్యూటీలో ఉండడం వల్ల వారు ఒత్తిడికి గురవుతున్నారని చాలా కాలంగా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సీనియర్‌ వైద్యుల విఽధులను కూడా తామే నిర్వహిస్తున్నామని పీజీ వైద్య విద్యార్థులు పలుమార్లు ఆరోపించారు.

డాక్టర్‌ సురేశ్‌ మృతి బాధాకరం: ఉస్మానియా జూనియర్‌ వైద్యుల సంఘం

డాక్టర్‌ సురేశ్‌ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని ఉస్మానియా జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్‌, డాక్టర్‌ రాజు అన్నారు. సురేశ్‌ మృతికి సీనియర్‌ వైద్యుల వేధింపులే కారణమని ఆరోపించడం సరికాదన్నారు. సీనియర్‌ వైద్యులుగానీ, హెచ్‌ఓడీలు గానీ వేధించలేదని పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 04:37 AM