2 కిలోమీటర్ల క్యూ
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:08 AM
సరిగ్గా సమయం ఉదయం 11 గంటలు.. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద పెట్రోల్, డీజిల్ కోసం రెండు కిలోమీటర్లపైగా వాహనాలు బారులుదీరాయి.
పెట్రోల్, డీజిల్ కోసం గచ్చిబౌలిలో బారులు దీరిన వందలాది వాహనాలు
రాష్ట్రంలో రెండో రోజూ ఇంధనానికి కటకట
నిల్వలు ఉన్నా సరఫరాలో కంపెనీల నిర్లక్ష్యం
కొన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు వచ్చినా గంటల వ్యవధిలోనే ఖాళీ అయిన పరిస్థితి
50శాతంపైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు
ఏపీ, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలతో
సరిహద్దు జిల్లాల్లో ఇక్కట్లు.. లారీల బారులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సరిగ్గా సమయం ఉదయం 11 గంటలు.. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద పెట్రోల్, డీజిల్ కోసం రెండు కిలోమీటర్లపైగా వాహనాలు బారులుదీరాయి. ధరలు పెరుగుతాయన్న ప్రచారం, నిల్వలు ఉన్నా సరఫరాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీల) నిర్లక్ష్యం.. వెరసి రెండో రోజు మంగళవారమూ రాష్ట్రంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు దండిగా ఉన్నప్పటికీ... కేవలం సరఫరా లోపంతో వినియోగదారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఇంధన కొరత తీవ్రత కనిపించింది. దాదాపు 50శాతంపైగా ఔట్‌లెట్లలో ఇప్పటికీ నో స్టాక్ బోర్డులే ఉండడంతో.. మిగతా వాటిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. వాహనదారులు కిలోమీటర్ల మేర బారులుదీరాల్సి వస్తోంది.
సరఫరాకు ఓఎంసీల ఆపసోపాలు
పెట్రోల్, డీజిలు కొరతను అధిగమించేందుకు సరఫరాను పెంచాలని పౌరసరఫరాల అధికారులు కోరుతున్నా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నత్తలతో పోటీపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు పైపులైన్ ద్వారానే డీజిల్, పెట్రోల్ వస్తుండగా, ట్యాంకర్ల ద్వారా ఔట్‌లెట్లకు పంపించేందుకు ఓఎంసీలు అపసోపాలు పడుతున్నాయి. డీలర్లు ఐదింటికి ఇండెంటు పెడితే మూడు ట్యాంకర్లు, మూడింటికి ఇండెంటు పెడితే ఒకటి, రెండు ట్యాంకర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. దీంతో ఔట్‌లెట్లలో అమ్మకాలకు అనుగుణంగా సరఫరా ఉండటం లేదు. ఆయిల్ కంపెనీల నిర్వాకం వల్లే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కృత్రిమ కొరత ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి ఇలాంటి సమస్య ఉత్పన్నం కావడానికి ఓఎంసీలే కారణమని వాదన వినిపిస్తోంది. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేక పరిస్థితుల ప్రభావంతో జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య వచ్చిన తర్వాత సరఫరా పెంచినా ప్రయోజ నం ఉండటంలేదు. మంగళవారం ఇంధన సరఫరా 26 శాతం పెరిగింది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద వాహనాల సంఖ్య తగ్గలేదు. ఏ బంకులో చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపించాయి. మరోవైపు.. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్రలో సరఫరా సమస్యలున్నాయి. దీంతో పక్క రాష్ట్రాల వాహనదారులు(ముఖ్యంగా లారీలు) ఇంధనం కోసం ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతోనూ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడం సంక్షోభానికి కారణమవుతోంది. ఓఎంసీల వద్ద 12 వేలు, 14 వేలు, 18 వేలు, 22 వేలు, 25 వేల కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లు ఉన్నాయి.
చిన్న ట్యాంకర్లను ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ బంకులకు పంపిస్తే కొరత తీరుతుందని, అన్ని బంకుల్లో ఏకకాలంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటేనే రద్దీ తగ్గుతుందని డీలర్లు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 3,100 ట్యాంకర్లు (ఇంధన వాహనాలు) ఉన్నాయి. వీటన్నింటిని ఏకకాలంలో రంగంలోకి దించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సరఫరాను వేగవంతం చేయటానికి ముందస్తు ఆర్డర్లను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో మంగళవారం పెట్రోల్, డీజిల్ సరఫరా గణనీయంగా పెరిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒక రోజు డీజిల్ సగటు వినియోగం 7,348 కిలోలీటర్లు ఉండగా, ప్రస్తుతం 18,449 కిలో లీటర్ల మేర సరఫరా చేస్తున్నారు. పెట్రోల్ సగటు వినియోగం 5,883కిలో లీటర్లు ఉండగా.. సరఫరాను 11,490 కిలో లీటర్లకు పెంచారు. నిన్నటితో పోలిస్తే కొరత తగ్గిందని, బుధవారం సాయంత్రానికి పరిస్థితి కుదుటపడుతుందని డీలర్లు భావిస్తున్నారు.
వదంతుల వల్లే పెట్రోల్, డీజిల్ కొరత: మల్లు రవి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు కొరత లేదని, సగటు వినియోగం కంటే ఎక్కువగా సరఫరా జరుగుతోందని ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందన్న వదంతుల వల్లే ప్రజలు అవసరం లేకున్నా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోలియం శాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా తాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులతో మాట్లాడానని, కొరత అనేదే లేదని వారు చెప్పారని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదీ పరిస్థితి
హైదరాబాద్ వ్యాప్తంగా 50శాతం ఔట్‌లెట్లు మూతపడగా.. ఇంధనం ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు బారులుదీరారు. లంగర్‌హౌజ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బంకులో ఉదయం 6 గంటలకు పెట్రోల్ ట్యాంకర్ రాగా.. 10.30 గంటల్లోపే ఇంధనమంతా ఖాళీ అయింది. దీంతో మళ్లీ నో స్టాక్ బోర్టు పెట్టారు. పెట్రోల్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్న వాహనదారులు.. బంకుల వద్ద భారీ క్యూలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి ఎండలో వేచి ఉండి మరీ ఇంధనం నింపుకొని వెళ్తున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో బైక్‌లకు రూ.200, కార్లకు రూ.500 చొప్పున ఇంధనాన్నే విక్రయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. బైక్, కార్లు, లారీలకు పరిమితులు విధించి.. విక్రయాలు చేపట్టారు. కామారెడ్డిలో ఆటో డ్రైవర్లు, పెద్ద వాహనదారులు, షాపింగ్ మాల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 20-30లీటర్ల క్యాన్లను లైన్‌లో ఉంచి మరీ డీజిల్ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 80శాతం బంకుల్లో డీజిల్ అందుబాటులో లేదు. సాధారణ అమ్మకాలతో పోలిస్తే సగం మేరకే సరఫరా ఉందని డీలర్లు చెబుతున్నారు. హుజూరాబాద్‌లో 8 బంకులు ఉండగా, ఎక్కడా ఇంధనం అందుబాటులో లేదు. డీజిల్ తెస్తేనే వరి కోసేందుకు వస్తామని హార్వెస్టర్ల యజమానులు తేల్చి చెబుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కొన్ని ఔట్‌లెట్లకు ఉదయాన్నే ట్యాంకర్లు వచ్చినా.. మధ్యాహ్నానికే స్టాక్ అయిపోయింది. వనపర్తి. గద్వాల, నారాయణపేట జిల్లాల్లోనూ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.