Interim Orders Extended for KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయాలన్న పిటిషన్లు వాయిదా
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:43 AM
కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ ...
కేసీఆర్, హరీశ్‌పై ఎలాంటి చర్యలూ వద్దన్న ఉత్తర్వులు పొడిగింపు
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్-1952కు విరుద్ధంగా వ్యవహరించిందని.. సెక్షన్-8 బీ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా సెక్షన్-8 సీ ప్రకారం తమకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశమివ్వకుండా తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడం చెల్లదని పేర్కొంటూ కేసీఆర్, హరీశ్, జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లు సోమవారం మరోసారి చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్ల రిప్లై తమకు ఆలస్యంగా అందడంతో లిఖితపూర్వక వాదనలు సమర్పించలేకపోయామన్నారు. దీంతో వచ్చే వాయిదాకు వారం ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని.. పిటిషనర్లపై చర్యలు తీసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.