kumaram bheem asifabad- అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:31 PM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఆసిఫాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో వేణులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగంబస్తీకి చెందిన పోచమ్మ తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ పట్టణం నూర్‌నగర్‌కు చెందిన జగన్నాథ్ తన పిల్లలు తన ఆస్తిని మొత్తం తీసుకొని తన పోషణ పట్టించుకోవడంలేదని తన ఆస్తిని తనకు అప్పగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం బెండార గ్రామానికి చెందిన హరిక తనకు ఆశ వర్కర్‌గా ఉపాధి కల్పించాలని దరఖాస్తు అందజేశారు. సిర్పూర్(యూ) మండలం పాములవాడ గ్రామానికి చెందిన ఆత్రం అర్జుబాయి తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణం బాలాజీనగర్‌కు చెందిన స్వప్న తనకు రెండు పడకల గదుల ఇళ్లు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. కెరమెరి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన గిరిజనులు తమ వ్యవసాయభూములకు బావులు, బోరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అర్జీ సమర్పించారు.
- పిల్లల కోసం..
కలెక్టరేట్‌లో సాదారణ ప్రజావాణి కార్యక్రమంతో పాటు పిల్లల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పిల్లలు తమతమ సమస్యలను ప్రజావాణిలో అదికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, అదనపు గదుల నిర్మాణం, మూత్రశాలలు నిర్మించాలని అర్జీ సమర్పించారు. మండలంలోని వావుదాం గ్రామానికి చెందిన విద్యార్థులు తమ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం, తాగునీరు, వంటశాల, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అర్జీ సమర్పించారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన అచ్యుతవల్లి అనే 6వ తరగతి విద్యార్థిని తనకు కరీంనగర్ జిల్లా చింతకుంటలో గల సాంఘిక సంక్షేమ పాఠశాలలో సీటు వచ్చిందని తనకు దూరం అవుతున్నందున జిల్లాలో ఏదైన గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని దరఖాస్తు అందజేసుకున్నది. పిల్లల ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.