ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘స్టైపెండ్’ అక్రమాలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:52 AM
శిక్షణలో ఉన్న మెడికల్ విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైపెండ్ చెల్లించకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.....
హైకోర్టులో పిల్.. రాష్ట్ర సర్కారు, ఎన్‌ఎంసీ సహా కాళోజీ వర్సిటీకి నోటీసులు
శిక్షణలో ఉన్న మెడికల్ విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైపెండ్ చెల్లించకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పలువురు బాధిత విద్యార్థులు హైకోర్టుకు ఈ-మెయిల్స్ ద్వారా లేఖలు పంపడంతో ఈ బాగోతం బయటపడింది. స్టైపెండ్ చెల్లించకుండా యాజమాన్యాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. శ్రమ దోపిడీకి పాల్పడటమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా వేఽధిస్తున్నాయని పలువురు బాధిత విద్యార్థులు పేర్కొన్నారు. ఆయా లేఖలను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను ప్రతివాదులుగా చేర్చింది. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టైపెండ్ చెల్లించడం లేదన్న ఆరోపణలు నిజమేనని.. భాస్కరా మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజ్ తదితర మెడికల్ కాలేజీలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. అన్ని మెడికల్ కాలేజీలను నియంత్రించేది కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీని పార్టీగా చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కాళోజీ వర్సిటీని ప్రతివాదిగా చేర్చి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆ వర్సిటీ సహా అందరూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణ నాలుగు వారాలకు వాయిదాపడింది.
వివాహాల నమోదు దరఖాస్తుల వివరాలు గోప్యం
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ నిర్వహించే పోర్టల్‌లో వివాహాల నమోదుకు సంబంధించిన దరఖాస్తుల వివరాల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు రిజిస్ర్టేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు ఐజీ మువ్వా వెంకట రాజేష్ దరఖాస్తుదారుల వివరాల గోప్యత, భద్రతపై దృష్టిసారించారు. దరఖాస్తుదారుల వివరాలు ఇతరులు సేకరించకుండా, దరఖాస్తులు డౌన్‌లోడ్‌కాకుండా చర్యలు చేపట్టారు. అలాగే దరఖాస్తుదారుల ఆధార్, ఫోన్ నంబరు, చిరునామా వంటి వివరాలు కనిపించకుండా చేశారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్డ్ వివాహానికి ముందు 30 రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ కోసం దరఖాస్తుదారుల వివరాల నోటీసును అందుబాటులో ఉంచుతారు. ఈమేరకు ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డులో దరఖాస్తు నంబరు, నోటీసు తేదీ వంటివి కనిపిస్తాయి. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు.. పూర్తి వివరాలను తీసుకుని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ వంటివి కనిపించకుండా చేశామని ఐజీ తెలిపారు.