Share News

పోలీసులపై దాడికి పెంపుడు కుక్క

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:00 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ ట్రాప్‌’ ముఠా కేసులో.. విస్తుపోయే మరిన్ని అంశాలు వెలుగు చూశాయి. బొల్లా బ్రదర్స్‌.. పోలీసులు సోదాలకు..

పోలీసులపై దాడికి పెంపుడు కుక్క

  • ఇంట్లో ఎయిర్‌గన్‌

  • దాడులను అడ్డుకునేందుకు గంజాయి ముఠా ఎత్తులు

  • బొల్లా బ్రదర్స్‌ సహా ఐదుగురు ప్రధాన నిందితులు

  • ఒడిసా నుంచి 29మంది గంజాయి సరఫరా దారులు

  • రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్‌,ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ ట్రాప్‌’ ముఠా కేసులో.. విస్తుపోయే మరిన్ని అంశాలు వెలుగు చూశాయి. బొల్లా బ్రదర్స్‌.. పోలీసులు సోదాలకు వస్తే, వారిపై దాడి చేసేందుకు ఇంటి ఆవరణలో ఒక పెంపుడు కుక్కను సిద్ధంగా ఉంచుకోవడంతోపాటు, ఇంట్లో ఎయిర్‌గన్స్‌ పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ విధంగా పోలీసులు దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ ముఠా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు వెల్లడైంది. గంజాయి విక్రయాలను పోలీసుల కళ్లుగప్పి విక్రయించేందుకు నిందితులు పకడ్బంధీగా వ్యవహరించినట్టు ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు (మాదకద్రవ్య నిరోధక పోలీసు విభాగం) తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో గత వారం గంజాయి డెడ్‌ట్రాప్‌ ముఠాను ఈగల్‌ ఫోర్స్‌ పట్టుకోవడం తెలిసిందే. ఈ కేసులో బొల్లా దుర్గాప్రసాద్‌, బొల్లా కిరణ్‌, బొల్లా కమలాకర్‌, బొల్లా హారికను అరెస్టు చేయగా, మరో నిందితుడు రాజును విచారించి పంపించివేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురిని ప్రధాన నిందితులుగా చూపించారు. బొల్లా సోదరులకు గంజాయి సరఫరా చేసే.. ఒడిశాకు చెందిన 29మంది వివరాలను గుర్తించినట్టు తెలిపారు. చోరీ కేసుల్లో నేరగాళ్ల సమాచారాన్ని బొల్లా సోదరులు పోలీసులకు చేరవేసి.. పార్టీలతో వారిని మభ్యపెట్టారని పేర్కొన్నారు. వీరు డెడ్‌ట్రాప్‌ విధానంలో (పరోక్షంగా) గంజాయి విక్రయాలు సాగించడం తెలిసిందే. ముందుగా డిజిటల్‌ చెల్లింపులు తీసుకుని, ఆ తర్వాత గంజాయి పాకెట్లను ఒక ప్రాంతంలో ఉంచి, వాటి ఫొటో, లొకేషన్‌ను కస్టమర్లకు చేరవేసేవారని విచారణలో వెల్లడైంది. వీరికి ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసిన 225మంది కస్టమర్ల జాబితా లభించిందని, ఆ వివరాలను పరిశీలిస్తున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 06:01 AM