వీడని అనాసక్తి..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:25 AM
వ్యవసాయ రంగంలో రైతులకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అమలు చేసే దిశగా తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులు అనాసక్తి వీడడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులకు అవకాశం కల్పిస్తూ గడువు పొడగిస్తున్నా అనుకున్న లక్ష్యం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వ్యవసాయ రంగంలో రైతులకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అమలు చేసే దిశగా తీసుకువచ్చిన ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులు అనాసక్తి వీడడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులకు అవకాశం కల్పిస్తూ గడువు పొడగిస్తున్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానం తీసుకవచ్చింది. రైతులకు డిజిటల్ గుర్తింపు ఇచ్చేందుకు చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులు నమోదు కావడానికి ఈనెల 30 చివరి గడువుగా నిర్ణయించారు. రైతులకు అవగాహన కల్పించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే విధంగా ఏఈవోలు అవగాహన కల్పిస్తున్నారు. మీసేవ కేంద్రాల్లోనూ ఫార్మర్ రిజిస్ట్రీకి అవకాశం కల్పించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాలు, వివిధ రైతులకు ప్రయోజనాలు కల్పించడానికి ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పారదర్శకంగా రైతులకు సేవలందించే దిశగా..
రైతులకు పారదర్శకంగా ఎరువులు, విత్తనాలు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఫార్మర్ రిజిస్ట్రీ కీలకంగా మారనుంది. రైతు వేదికల్లో ఉచితంగా, మీసేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి రైతులు నేరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిన అన్నదాతలు మాత్రం అనాసక్తి వీడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే వ్యవసాయ పథకాలకు 11 అంకెల యూనిక్ ఫార్మర్ ఐడీ ఉపయోగపడుతుంది. భూమికి సంబంధించిన సమాచారం పూర్తిగా డిజిటల్ రూపంలో నిక్షిప్తం కావడం వల్ల ఫసల్ బీమా, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, నేచురల్ ఫార్మింగ్ మిషన్, సాయిల్ హెల్త్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ జన్ ధన్ యోజన, జాతీయ ఆహార భద్రత పథకం, నాబార్డ్ రుణసహాయం, కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువులు, యంత్ర పరికరాలు రైతులకు అందించడానికి ఒకే ఐడీ కార్డు ద్వారా సులభంగా లబ్ధి చేకూర్చే వీలు కలుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా మోసాలు, నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలు జరగకుండా పారదర్శకతగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులు మాత్రం ఫార్మా రిజిస్ట్రీ చేసుకోవడంలో అనాసక్తి చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పథకాలు కోల్పోతారని అవగాహన కల్పిస్తున్న రైతుల్లో మాత్రం ఆసక్తి చూపడం లేదు.
30 వరకు గడువు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.43 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 2.47 ఎకరాకలకు సంబంధించి 81416 ఎకరాలు 75931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధిచి 25092 మంది రైతుల వద్ద 86460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8346 మంది రైతుల వద్ద 53560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1427 మంది రైతుల వద్ద 18962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2756 ఎకరాల భూములు ఉన్నాయి. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన ఫార్మర్ రిజిస్ట్రీకి అర్హులుగా 1,46,952 మంది రైతులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 1,13,795 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ అయ్యారు. జిల్లాలో 68.49 శాతం పూర్తి చేశారు. జిల్లాలో ఇంకా 33,157 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కాకుండా మిగిలిపోయారు. ఈనెల 30వ తేదీ వరకు ఫార్మా రిజిస్ట్రీ కోసం చివరి గడువు విధించారు.
రైతులకు ఎంతో ప్రయోజనం..
- అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయ అధికారి
ఫార్మర్ రిజిస్ట్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంద శాతం పూర్తి చేసే దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వ్యవసాయ సంక్షేమం, ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ తప్పనిసరి అవుతుంది. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలి. ఈనెల 30వ తేదీ చివరి గడువు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు వివరాలు..
మండలం పూర్తయిన రిజిస్ట్రీ పెండింగ్
బోయిన్‌పల్లి 82.17 17.83
చందుర్తి 83.30 16.70
గంభీరావుపేట్ 80.32 19.68
ఇల్లంతకుంట 81.83 18.17
కోనరావుపేట్ 81.18 18.82
ముస్తాబాద్ 78.04 21.37
రుద్రంగి 74.12 25.88
సిరిసిల్ల 67.12 32.88
తంగళ్ళపల్లి 78.63 21.37
వీర్నపల్లి 76.62 23.38
వేములవాడ రూరల్ 76.55 2345
వేములవాడ 63.74 36.26
ఎల్లారెడ్డిపేట 68.50 31.50
మొత్తం 68.49 31.50