kumaram bheem asifabad- అనుమతులే అడ్డంకి
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:22 PM
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంతరించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అనుమతులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు.
- ఒర్రెలు, వాగులపై వంతెనలు, రోడ్లు లేక ప్రజలకు ఇబ్బందులు
- దశాబ్దాలుగా మారని పరిస్థితి
ఆసిఫాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంతరించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అనుమతులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దీంతో వర్షాకాలంలో గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా పరిస్థితుల్లో మార్పు లేదు. జిలా ్లలోని పలు మండలాల్లో రహదారులు, కల్వర్టులు, వంతెనలకు అటవీ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి
- ఆరు మండలాలకు..
జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, సిర్పూర్(టి), వాంకిడి, తిర్యాణి తదితర మండలాల్లో మారుమూల గ్రామాలకు రహదారులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అటవీ శాఖ అనుమతులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు కల్వర్టులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచి పోతున్నాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, వంతెనలు లేక ఆయా గ్రామాలకు కనీసం అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంది. చింతలమానేపల్లి మండలంలోని దిందా వాగుపై వంతెన నిర్మాణానికి 2017లో ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అనుమతులు లేక వంతెన పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల వాగుపై వంతెన నిర్మాణానికి అటవీ అనుమతులు వచ్చాయని చెబుతున్నా ఇప్పటికీ పనులు చేపట్టలేదు. బెజ్జూరు మండలంలోని పాపన్నపేట నుంచి పెంచికలపేట మండలంలోని కమ్మర్‌గాం మీదుగా మొర్లిగూడ వరకు రోడ్డు నిర్మాణాలకు 36 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు సైతం పూర్తయ్యాయి. అటవీ అనుమతులు లేవన్న కారణంతో పనులు సాగడం లేదు. దహెగాం మండలంలోని మొట్లగూడ-ఖర్జీ గ్రామానికి అప్పటి ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసింది. దీనికి కూడా అనుమతులు లేక రోడ్లు పనులు ఆగిపోయాయి. బెజ్జూరు మండలంలోని సోమిని-తలాయి మీదుగా మొర్లిగూడకు 18 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. దహెగాం మండలంలోని పార్వతిపేట-చిన్నగుడిపేట మధ్య కొంతమేర బీటీ పనులు చేపట్టారు. కానీ అనుమతులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వాంకిడి మండలం నుంచి కాగజ్‌నగర్ మండలంలోని మాలిని మీదుగా సిర్పూర్(టి) వరకు నిధులు మంజూరైనా అటవీ అనుమతుల కారణంగా పనులు నిలిచిపోయాయి. తిర్యాణి మండలంలోని మాణిక్యాపూర్-మంగి రహదారి నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితుల కోసం రహదారుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది. మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా మిగితా పనులు అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయాయి. తిర్యాణి మండలం రొంపల్లి-గుండాల రోడ్డు నిర్మాణానికి 2011లో ఐదు కోట్ల రూపాయలు మంజూ రయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టగా వంతెన పూర్తి చేశారు. కానీ అటవీ ప్రాంతంలో అనుమతులు లేవన్న కారణంతో పనులు నిలిపి వేశారు.
- మొగవెల్లి-గూడెం గ్రామాల మధ్య..
బెజ్జూరు మండలంలోని మొగవెల్లి-గూడెం గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి 2014లో పీఎంజీఎస్‌వై పథకంలో రూ. 6.65కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రెండు వంతెనలు, ఏడు కల్వర్టులు పూర్తి చేశారు. అప్పట్లో రోడ్డు నిర్మాణం కోసం కంకర వేశారు. అనుమతులు లేవన్న కారణంతో అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో కంకర వేసిన రోడ్డుపైనే రాకపోకలు కొనసాగిస్తు న్నారు. సుశ్మీర్-కుశ్నపల్లి గ్రామాల మధ్య రెండు ఒర్రెలపై వంతెనల నిర్మాణాలకు రెండు వంతెనల నిర్మాణం కోసం రూ. 4.25 కోట్లు మంజూరు చేసింది. పనులకు ప్రారంభ దశలోనే అటవీ అధికారులు అడ్డుపడ్డారు. ఇలా అనుమతులు రాకపోవ డంతో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. సలుగుపల్లి-పెంచికలపేట గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి పది కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో పనులు చేపట్టలేదు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.