ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:14 AM
రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి.....
అన్ని కార్యాలయాలు ఒకేలా ఉండేలా డిజైన్లు.. తొలి దశలో 65, రెండో దశలో 170 భవనాల నిర్మాణం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలి దశలో అద్దె భవనాల్లో ఉన్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలు కలిపి 65 కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ నుంచి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామని ఈ సందర్భంగా అన్నారు. నూతన భవనాలన్నీ ఒకే నమూనాలో ఉండేలా డిజైన్ చేయిస్తామని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలను అందించేలా నూతన భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. గత పాలకులు ముందుచూపు లేకుండా మండలాలు ఏర్పాటు చేశారని విమర్శించారు. కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్నాయని తెలిపారు. అనేక రెవెన్యూ కార్యాలయాల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గత పాలకులు కలెక్టరేట్ కార్యాలయాలను జిల్లాలకు దూరంగా నిర్మించారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పాలనను బలోపేతం చేశామన్నారు. అలాగే, రిజిస్ట్రేషన్ శాఖలోనూ అత్యాధునిక వసతులతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని పొంగులేటి చెప్పారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించామన్నారు. గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.