మండల ప్రజావాణికి ప్రజలు దూరం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:58 AM
ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని ప్రభుత్వం ప్రారంభించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల పరిషత్ కార్యాలయాల్లోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు
పెద్దపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని ప్రభుత్వం ప్రారంభించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల పరిషత్ కార్యాలయాల్లోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు మాత్రం మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కంటే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు 17 ఆగస్టు 2026న పెద్దపల్లి జిల్లాలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ ఇతర ప్రధాన శాఖలకు చెందిన అధికారులు హాజరవుతూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాస తగ్గించడం, మండల స్థాయిలోనే అధికారులను సంప్రదించే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం.
ఫ13 మండలాల్లో కార్యక్రమం
ఆగస్టు 17 నుంచి అక్టోబర్ నెలలోని సోమవారాల వరకు అందిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 13 మండలాల్లో మొత్తం 1,104 దరఖాస్తులు స్వీకరించారు. మండలాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే మండలాల మధ్య ప్రజల స్పందనలో వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా జూలపల్లి, అంతర్గాం, ఓదెల సుల్తానాబాద్, ఎలిగేడు వంటి మండలాల్లో దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఆగస్టులో రెండు, సెప్టెంబరులో మూడు, ఈ నెలలో రెండు మొత్తం ఏడు వారాల పాటు ప్రజావాణి నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1,104 ఽధరఖాస్తులు వచ్చాయి. వీటిలో 648 దరఖాస్తుల సమస్యలు పరిష్కరించారు. 427 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి.
ఫ కలెక్టరేట్కే ప్రజల మొగ్గు
పెద్దపల్లి జిల్లా భౌగోళికంగా చిన్నదిగా ఉండటం, పలు మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సులభంగా ఉండటంతో ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో కొన్నిసార్లు కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. దీంతో తమ సమస్యను నేరుగా జిల్లా ఉన్నతాధికారికి వివరించవచ్చని, సమస్య పరిష్కారంపై స్పష్టత పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగా మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లడం కంటే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు వెళ్లేందుకే కొంతమంది ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, మండల స్థాయిలోనూ సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండటం వల్ల స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. గ్రామాల్లోని రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, పింఛన్లు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై మండల స్థాయి అధికా రులకు నేరుగా వినతులు అందజేయవచ్చు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సమయం, ప్రయాణ ఖర్చులు వెచ్చించాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు
ఫ మండల ప్రజావాణిపై ప్రచారం పెంచాలి
మండల స్థాయి ప్రజావాణికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడానికి గల కారణాలను జిల్లా యంత్రాంగం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలి. ప్రతి అర్జీకి నమోదు సంఖ్య ఇవ్వడం, పరిష్కార స్థితిని తెలియజేయడం, పెండింగ్ సమస్యలపై సంబంధిత అధికారులను బాధ్యులను చేయడం వంటి చర్యలు చేపడితే ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలు రాకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఒకవేళ ప్రజలు దరఖాస్తులు సమర్పించినా వాటి పరిష్కారంలో జాప్యం జరిగితే కార్యక్రమంపై ఆసక్తి మరింత తగ్గే ప్రమాదం ఉంది. దరఖాస్తుల స్వీకరణతోపాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.