kumaram bheem asifabad- ప్రాణహిత పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:35 PM
ప్రాణహిత, పెన్‌గంగ నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
కౌటాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత, పెన్‌గంగ నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత పరివాహక లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. రైతులు, చేపలు పట్టే వారు నది పరివాహ ప్రాంతానికి వెళ్ల రాదని తెలిపారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ ఉదృతిని తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 146.65 మీటర్ల ఎత్తులో వరద ఉధృతి కొనసాగుతుందని, దిగువకు 7.75లక్షల క్యూసెక్సు వరద నీరు ప్రవహిస్తోందని చెప్పారు. ఎగువ నుంచి ఇంకా 12 లక్షల వరద ప్రవాహం వస్తున్నదని వివరించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ టెక్నికల్ కన్సలెంట్ సత్యానంద్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ వినయ్ బాబు, డీఈ వెంకటరమణ, ఏఈ రాజ్ కుమార్, సర్పంచ్ సూరజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల సరిహద్దులో పెన్‌గంగా నదిపై ఉన్న పోడ్సా అంతర్రాష్ట్ర వంతెనను కలెక్టర్ కె.హరిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాల వారైనా వరద నీరు పెరగడం వల్ల అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపలు పట్టేవారు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపారు. కలెక్టర్ వెంట ఎమ్మారై స్వప్న, సిబ్బంది ఉన్నారు.