Share News

కాలుష్య కోరల్లో పెగడపల్లి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:02 PM

జైపూర్‌ మండ లంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ) నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీప పెగడపల్లి గ్రామ స్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఈ కాలుష్యం మూలం గా వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

కాలుష్య కోరల్లో పెగడపల్లి
ప్లాంట్‌ కాంపౌండ్‌ను ఆనుకొని ఉన్న పెగడపల్లి గ్రామం

- జైపూర్‌ ఎస్టీపీపీ కాలుష్యంతో గ్రామస్థుల ప్రాణాలకు ముప్పు

- క్యాన్సర్‌, టీబీ తదితర వ్యాధుల బారిన పడుతున్న వైనం

- ఇప్పటికే వివిధ క్యాన్సర్లతో ఆరుగురి మృతి.. మరో నలుగురైదుగురికి క్యాన్సర్‌

- కలుషితమవుతున్న తాగునీరు, పంటలపైనా ప్రభావం

మంచిర్యాల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జైపూర్‌ మండ లంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ) నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీప పెగడపల్లి గ్రామ స్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఈ కాలుష్యం మూలం గా వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రా మంలో 600 ఇళ్లు ఉండగా.. 1,500 మంది ఉన్నారు. సింగరేణి ఆధ్వ ర్యంలో పెగడపల్లి వద్ద ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం 2009లో 2,200 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో పెగడపల్లికి చెందిన 1,400 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరించారు. తర్వాత ప్లాంట్‌ను మరో 600 మెగావాట్లకు పెంచా రు. ప్రస్తుతం మూడో యూనిట్‌ కింద అదనంగా మరో 600 మెగావాట్లకు అప్‌గ్రేడ్‌ చేసే పనిలో ఉన్నారు. క్రమంగా ఎస్టీపీపీని అభి వృద్ధి చేస్తున్న అధికారులు.. భూములు కోల్పోయిన పెగడ పల్లి ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు తీసుకునేటప్పుడు పెగడపల్లిని దత్తత తీసుకుంటామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతు న్నారు. ప్లాంటులో ఉద్యోగాలు, గ్రామంలో ఆస్పత్రి, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్‌ ప్లాంట్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే 17 ఏళ్లవుతున్నా హామీలమేరకు ఏ ఒక్క వసతి కల్పించలేదంటున్నారు. ప్లాంటు గ్రామాన్ని ఆనుకొని ఉండడంతో బావుల్లోని తాగునీరు పూర్తిగా కలుషితమై ఉప్పుగా మారింది. వేడి వాతావరణంతో పంటలు పండటంలేదు. తోటలు, వరిపొలాలు బీళ్లుగా మారుతున్నాయి. బూడిద, ఇతర కలుషిత పదార్థాలు పడుతుండడంతో గ్రామస్తులు క్యాన్సర్‌, టీబీ, ఊపిరితిత్తుల అనారోగ్యం, చర్మ వ్యాధుల పడుతున్నారు. తలనొప్పి, దగ్గు, దమ్ముతో అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఇప్పటికే వివిధ రకాల క్యాన్సర్లతో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురైదుగురు క్యాన్సర్లతో బాధపడుతున్నారు. రాత్రివేళ దుమ్ము, ధూళి, బూడిదను భారీస్థాయిలో గాల్లోకి వదులుతుండటంతో ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతోందంటున్నారు. అయినా అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అనారోగ్యాల బారిన పడుతూ మరణిస్తున్నా కన్నెత్తి చూడడంలేదంటున్నారు. గ్రామానికి చెందిన మద్దుల సత్యనారాయణ రెడ్డి క్యాన్సర్‌ బారిన పడగా, ఆయన తల్లిదండ్రులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు.

ఫ పునరావాసం కల్పించాలి..

-రామగిరి రాము, పెగడపల్లి సర్పంచ్‌

మా గ్రామ భూములను సింగరేణి సంస్థకు అప్పగించగా వాటిలో ఎస్టీపీపీ ఏర్పాటు చేశారు. తర్వాత అధికారులు మా గురించి పట్టించుకోవడం లేదు. చాలా మంది గ్రామస్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. చనిపోతున్నారు. ఇప్పటికైనా మిగిలిన భూములను మొత్తం తీసుకొని మాకు వేరే చోట పునరావాసం కల్పించాలి.

ఫ క్యాన్సర్‌ బారిన పడ్డా...

- చిలగాని భాగ్యలక్ష్మి

ప్లాంటు నుంచి వచ్చే కలుషిత వ్యర్థాలతో క్యాన్సర్‌ బారిన పడ్డాను. ఇప్పటికే ఊరిలో క్యాన్సర్‌తో కొందరు చనిపోయారు. ప్లాంటు కారణంగా గ్రామంలో అనేక సమస్యలున్నాయి. ప్రతి ఇంట్లోని వారు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:02 PM