Share News

‘పెద్ది’ సినిమా టికెట్‌ ధరలు పెంచండి

ABN , Publish Date - May 30 , 2026 | 03:56 AM

హీరో రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్‌ రేట్లు పెంచే అంశంపై నిర్ణయం తీసుకునేలా హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ...

‘పెద్ది’ సినిమా టికెట్‌ ధరలు పెంచండి

  • హైకోర్టును ఆశ్రయించిన మైత్రీమూవీ మేకర్స్‌

  • ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతోపిటిషన్‌ ఉపసంహరణ

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): హీరో రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్‌ రేట్లు పెంచే అంశంపై నిర్ణయం తీసుకునేలా హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే సానుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో అనంతరం దాన్ని ఉపసంహరించుకొంది. ఈ సినిమా జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని, ఈ నేపథ్యంలో మొదటి ఏడు రోజులపాటు టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే రెండుసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్టు పేర్కొంది. సినిమా టికెట్‌ రేట్లు పెంచాల్సి వస్తే 90 రోజుల ముందే ఆ అంశాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని, ఆసక్తి ఉన్న వ్యక్తులు దానిపై తెలంగాణ సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌ - 1955 సెక్షన్‌ 7ఏ ప్రకారం అభ్యంతరాలు తెలపవచ్చని గతంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఆదేశాలు జారీచేసినట్టు గుర్తు చేసింది. ఆ తీర్పులో తాము పార్టీగా లేమని, దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నామని వివరించింది. అందువల్ల సినిమా టికెట్‌ రేట్లు పెంచాలంటూ ఈనెల 15, 25 తేదీల్లో ఇచ్చిన వినతులపై అధికారులు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌ లంచ్‌మోషన్‌ (అత్యవసర పిటిషన్‌) రూపంలో జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్‌రాజే వాదిస్తూ.. సినిమా టికెట్ల రేట్లు పెంపు అంశంపై హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు నడుస్తున్నాయని తెలిపారు. అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై డివిజన్‌ బెంచ్‌, సింగిల్‌ బెంచ్‌ తీర్పులు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇస్తే గందరగోళం తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో టికెట్‌ రేట్లు పెంచినందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శిపై సింగిల్‌ జడ్జి ధర్మాసనం సుమోటోగా కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ చేపట్టిందని గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిర్మాణ సంస్థకు అనుకూలంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేమని తెలిపింది. విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రింగారపు సాహిల్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జూన్‌ 4న సినిమా విడుదల ఉందని, ఆ తర్వాతకు వాయిదా వేస్తే పిటిషన్‌కు కాలం చెల్లిపోతుందని పేర్కొన్నారు. అందువల్ల అధికారులను ఆశ్రయించేందుకు వీలుగా ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2026 | 03:56 AM