వరుస మరణాలు.. ఊరు ఖాళీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:22 AM
ఊర్లో ఒకరు చనిపోయిన ఒకట్రెండు రోజులకు మరొకరెవరో చనిపోతే యాదృచ్చికం అని సరిపెట్టుకున్నా అలా వరుసపెట్టి మరణాలు సంభవిస్తుంటే? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల అనే ఊర్లో ఇలానే జరగడంతో అక్కడి ప్రజలు భయపడిపోయారు
నెలలో 16 చావులు.. పీడపట్టిందని గుబులు
పొద్దున ఐదింటికే ఇళ్లు వదిలి శివార్లకు ప్రజలు
అక్కడే వంటావార్పు.. సూర్యాస్తమయానికి ఇళ్లకు
పెద్దపల్లి జిల్లా కనుకులలో ఘటన
సుల్తానాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఊర్లో ఒకరు చనిపోయిన ఒకట్రెండు రోజులకు మరొకరెవరో చనిపోతే యాదృచ్చికం అని సరిపెట్టుకున్నా అలా వరుసపెట్టి మరణాలు సంభవిస్తుంటే? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల అనే ఊర్లో ఇలానే జరగడంతో అక్కడి ప్రజలు భయపడిపోయారు. అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యవంతులు అనే తేడా లేకుండా నెలరోజుల్లో 16 మంది చనిపోవడంతో హడలిపోయారు. ఈ మరణాల్లో ఓ ఇంట్లో భోజనం చేస్తున్న వ్యక్తి అప్పటికప్పుడు పడిపోయి చనిపోవడం.. మరొకరు బైక్ నుంచి కింద పడి ప్రాణాలొదలడం వంటి ఘటనలూ ఉండటంతో ఊరికి ఏదో పీడ పట్టిందని గ్రామంలోని పెద్దలు ఓ నిర్ణయానికొచ్చేశారు. ఈ వరుస చావులకు అడ్డుకట్ట పడేదెలా? అని ఆలోచించి పండితులను ఆశయ్రించారు. వారి సూచనను గ్రామ ప్రజలు పక్కాగా పాటించారు. గురువారం సూర్యుడు ఉదయించకన్నా మునుపు నుంచి మలిసంద్య వేళ దాకా ఊర్లో ఒక్క ప్రాణి కూడా ఉండొద్దనే భావనతో మతాలకు అతీతంగా చిన్నాపెద్దా అనే తేడాలేకుండా జనమంతా ఊరు ఊరే ఖాళీ చేశారు. గురువారం తెల్లవారుజామున ఐదింటికే వంటసామాను, అవసరమైన దుస్తులు సర్దుకొని జనం శివార్లకు తరలిపోయారు. తమవెంట గొర్లు, మేకలు, ఎడ్లు, బర్లు ఇలా అన్ని జీవాలను తీసుకెళ్లారు. కొందరు శివారులోని నీరుకుళ్ల మానేరు రంగనాయక స్వామి ఆలయ ప్రాంణంలో, మరికొందరు ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం ప్రాంగణంలో, ఇంకొందరు సమీపంలోని క్వారీలు, మామిడి తోటల్లో బసచేశారు. అక్కడే వంటలు వండుకొని భోజనాలు చేశారు. సాయంత్రం దాకా అక్కడే ఉన్నారు. సూర్యుడు అస్తమించేలోగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.