పెద్దషాపూర్ భూవివాదం హైకోర్టులో ఉంది
ABN , Publish Date - May 27 , 2026 | 04:24 AM
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 172 నుంచి 183 వరకు ఉన్న సుమారు 170 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం ...
తహసీల్దార్ ఉత్తర్వుల ప్రకారం భూభారతిలో మార్పులు చేయలేదు
ఆ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి
జూన్ 12న విచారణ ఉంది
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వివరణ
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్ మండలం పెద్దషాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 172 నుంచి 183 వరకు ఉన్న సుమారు 170 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ భూములకు సంబంధించిన హక్కులు, మ్యుటేషన్లు, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ అంశాలపై పలు పిటిషన్లు, కోర్టు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. 1954-55 కాస్రా పహానీ, 1955-58 చేషాల పహాణీల ప్రకారం సదరు భూములు తొలుత పట్టా భూములుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అనంతరం ల్యాండ్ రిఫార్మ్ ట్రైబ్యునల్ ఉత్తర్వుల మేరకు సీలింగ్ సర్‌ప్లస్ భూముల కింద కొన్ని సర్వే నంబర్లలోని సుమారు 74.79 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ భూములు 22ఏ జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో నవాబ్ మహ్మద్‌యాసుపుద్ధీన్ ఖాన్, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. సుమారు 94.28 ఎకరాల భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు కాలేదని, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కావడం లేదని కోర్టుకు తెలిపారన్నారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సంబంధిత వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత పక్షాల నుంచి ఆధార పత్రాలు స్వీకరించిన తహసీల్దార్ 2026 ఫిబ్రవరి 28న సంబంధిత వ్యక్తులను యజమానులుగా ప్రకటిస్తూ ఆర్డర్ ఇచ్చారని కలెక్టర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ఓంకార్ క్యారియర్స్ అండ్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొందరు ఇదే భూమిపై కోర్టును ఆశ్రయించగా 2026 ఏప్రిల్ 16న న్యాయస్థానం స్టేట్‌సకో ఇచ్చిందని తెలిపారు. తదుపరి ఉత్తర్వుల్లోనూ సంబంధిత భూములపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త మ్యుటేషన్లు అనుమతించవద్దని కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని, తదుపరి విచారణ జూన్ 12కి వాయిదా ఉందని వెల్లడించారు. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా భూభారతి పోర్టల్‌లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.