Share News

ఈ నేల పవన్‌నూ ప్రేమిస్తుంది

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:02 AM

పవన్‌కల్యాణ్‌ను తెలంగాణకు రావద్దనిగానీ, ఇక్కడ పోటీచేయొద్దనిగానీ ఎవరూ అనడంలేదని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు.

ఈ నేల పవన్‌నూ ప్రేమిస్తుంది

  • ఆయన్ను రావొద్దని, పోటీ చేయొద్దని ఎవరూ అనలేదు

  • తెలంగాణ అస్తిత్వం మీద దాడి మాత్రం చేయొద్దు: అద్దంకి

  • కూనంనేని నిర్వహణలోని రౌండ్‌టేబుల్‌ భేటీలో వ్యాఖ్యలు

  • వివాదాస్పద ప్రకటనలకు ముగింపు పలుకుదామని విజ్ఞప్తి

  • ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పవన్‌ పోల్చడంపై ఆగ్రహం

  • నాగేశ్వర్‌పై ఏపీలో కేసులు ఉపసంహరించాలని డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌4(ఆంధ్రజ్యోతి): పవన్‌కల్యాణ్‌ను తెలంగాణకు రావద్దనిగానీ, ఇక్కడ పోటీచేయొద్దనిగానీ ఎవరూ అనడంలేదని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. ఈ నేల అస్తిత్వంపై దాడి చేయొద్దని పవన్‌కు సూచించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ అజెండాను తెలంగాణలో అమలుచేయడానికి పవన్‌కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే మరొక ఉద్యమం రాకపోదని హెచ్చరించారు. ప్రొ. నాగేశ్వర్‌ రాజకీయ విశ్లేషణపై ట్రోల్స్‌ను ఖండిస్తూ.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిర్వహణలో గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న అద్దంకి దయాకర్‌.. తెలంగాణ వాదులకు, ఇక్కడి ప్రభుత్వానికి పవన్‌మీద ఎలాంటి కోపంలేదని.. ఆత్మీయత, అనురాగాలకు నెలవైన తెలంగాణ పవన్‌నూ ప్రేమిస్తుందని స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రకటనలు, పరస్పర ఆరోపణలకు ముగింపు పలుకుదామని విజ్ఞప్తి చేశారు. ఇక.. నాగేశ్వర్‌ విశ్లేషణపై విభేదాలను విభిన్న మార్గాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేయొచ్చుగానీ దాడికి పాల్పడడం తగదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రాంతీయ వాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల కార్యకర్తలు ట్రోలర్స్‌గా మారి విశ్లేషకులు, జర్నలిస్టులను దూషిస్తున్నారని.. దీన్ని ఆయా పార్టీల అధినేతలు అడ్డుకోవాలని కోరారు. ఇక.. రాజ్యాంగం అంగీకరించని, చట్టం ఒప్పుకోనికేసులను ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. తద్వారా.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అంగీకరించబోమన్న హెచ్చరికను కూటమి ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. తాను రాజ్య నిర్బంధాలకు, కేసులకు భయపడనని స్పష్టం చేశారు. ప్రాంతీయ వాదాన్ని పవన్‌కల్యాణ్‌ ఉగ్రవాదంతో పోల్చడాన్ని సుప్రీం కోర్టు విశ్రాంత జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి తప్పుబట్టారు. అసలు ప్రాంతీయవాదానికి, అస్తిత్వవాదానికి తేడా పవన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మాయమైన చెరువులు, కుంటల లెక్కతీస్తే... ఎవరు ఎవరి అస్తిత్వంమీద దాడిచేశారో స్పష్టమవుతుందన్నారు. ప్రొ. నాగేశ్వర్‌పై ఏపీలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలంతా తీర్మానించారు. ఏపీ, తెలంగాణ మధ్య సామరస్య వాతావరణం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 05 , 2026 | 04:02 AM