Share News

పోరాటాల గడ్డ తెలంగాణ

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:27 AM

తెలంగాణ పోరాటాల గడ్డ. ఇక్కడి త్యాగాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. నేను తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకున్నవాడిని. తెలంగాణ గడ్డ నుంచే జనసేన....

పోరాటాల గడ్డ తెలంగాణ

  • జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది ఇక్కడే..

  • తెలంగాణ స్ఫూర్తిని పూర్తిగా అర్థం చేసుకున్నా

  • తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం:పవన్‌

  • మణికొండలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/నార్సింగి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ పోరాటాల గడ్డ. ఇక్కడి త్యాగాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. నేను తెలంగాణ ఆత్మను అర్ధం చేసుకున్నవాడిని. తెలంగాణ గడ్డ నుంచే జనసేన ప్రస్థానం మొదలైంది.’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపక అఽధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని మణికొండలో పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు సాగించాలనే దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. ‘రాజకీయాల్లో ప్రజల సమస్యలు వినే ఓపిక అవసరం. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పుకునేందుకు మన దగ్గరకు వస్తున్నారంటే వారిని మొదట గౌరవించాలి. వారి సమస్యను సావధానంగా వినాలి. పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పారు. తెలంగాణ దేశానికి గుండెకాయ లాంటిదన్నారు. తెలంగాణలో గొప్ప మేధావులు, పోరాట యోధులు, కవులు, కళాకారులున్నారని, దాశరథి కృష్ణమాచార్యులు, చాకలి ఐలమ్మ, కాళోజీ, సర్వాయి పాపన్న వంటి ఎందరో గొప్పవారు జీవించిన ఈ నేల జనసేన పార్టీకి కీలకం కానుందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి, కోశాధికారి ఏవీ.రత్నం, తెలంగాణ ఇన్‌చార్జి ఎన్‌.శంకర్‌ గౌడ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాధారాం రాజలింగం తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Updated Date - Jun 20 , 2026 | 04:27 AM