Share News

బీజేపీ చేతిలో తోలుబొమ్మ పవన్‌ కళ్యాణ్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:13 AM

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌... బీజేపీ ఆడిస్తున్న ఒక తోలు బొమ్మ అని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ విమర్శించారు.

బీజేపీ చేతిలో తోలుబొమ్మ పవన్‌ కళ్యాణ్‌

  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపర్చడం ఆయనకు కొత్తేమీ కాదు

  • కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించట్లేదు?

  • రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకోం: మహేష్‌

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌... బీజేపీ ఆడిస్తున్న ఒక తోలు బొమ్మ అని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పవన్‌ కళ్యాణ్‌ ఎలా పడితే అలా మాట్లాడటానికి ఇదేమీ సినిమా కాదని, అలాంటి వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. ‘తెలంగాణ కోసం ఎంతో మంది అమరులైనారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. తెలంగాణ ప్రజలు చూడనిదే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు ఆడాయా? ఆయన అంత పెద్ద హీరో అయ్యాడా? ఏపీ డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్రంలో ఆయన చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. బీజేపీ నాయకత్వం చెప్పిందే పలుకుతున్న పవన్‌ కళ్యాణ్‌.. కాంగ్రెస్‌ పార్టీ, దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన త్యాగాల చరిత్రను చదువుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతుంటే కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి వారి మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోందన్నారు. కాగా, లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పిస్తూ ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 50 ఏళ్ల అయిన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్‌ చేపడుతున్న బస్సుయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మహే్‌షకుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Jun 16 , 2026 | 05:13 AM